Terror Threat: రిపబ్లిక్ డే వేడుకల ముందు ఉగ్రవాద ముప్పుపై నిఘా
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని దిల్లీపై ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రిపబ్లిక్ డే రోజున దిల్లీతో పాటు దేశంలోని కీలక నగరాల్లో దాడులు చేపట్టేందుకు ఖలిస్థానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందినట్లు వెల్లడించాయి. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించే లక్ష్యంతో ఖలిస్థానీ సహా ఇతర రాడికల్ హ్యాండ్లర్లు స్థానిక గ్యాంగ్‌స్టర్ల సహకారం తీసుకుంటున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. హరియాణా, పంజాబ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందని అధికారులు తెలిపారు.
Details
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన
గతేడాది దిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన చోటుచేసుకున్న నేపధ్యంలో ఈ హెచ్చరికలను అత్యంత గంభీరంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. నిఘా వర్గాల సూచనలతో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.