Delhi LG: ఫైళ్ల తరలింపుపై నిఘా.. దిల్లీ సచివాలయానికి ఎల్జీ కొత్త మార్గదర్శకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
70 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని దిల్లీ కాషాయ దళం అధీనంలోకి వచ్చింది.
ఈ ఎన్నికల్లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు కీలక నేతలు ఓటమిని చవిచూశారు.
ఈ నేపథ్యంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి దిల్లీ సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.
సచివాలయం నుంచి ఎలాంటి ఫైళ్లు, హార్డ్ డ్రైవ్స్ బయటకు తీసుకెళ్లకూడదని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.
Details
ఎల్జీ కార్యాలయం ఆదేశాలు
దిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ నుంచి ఎలాంటి ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌లు బయటకి తీసుకెళ్లడం అనుమతించకూడదన్నారు.
అత్యవసరమైతే జనరల్ అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విభాగాల అధిపతులు ఈ నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
బీజేపీ గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
మాజీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు మంత్రులు, ఆప్ కీలక నేతలపై అవినీతి ఆరోపణలు వేగంగా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఎన్నికల్లో ఆప్ ఓటమి నేపథ్యంలో, ప్రభుత్వానికి సంబంధించిన కీలక ఫైళ్లు మాయమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగా ఎల్జీ కార్యాలయం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.