Loading...
Telangana: పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు
పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు

Telangana: పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా పూరిళ్లలో నివసిస్తున్న 43 వేల పేద కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేయడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేతో పాటు అందిన దరఖాస్తులను పరిశీలించగా, మొత్తం 82,890 కుటుంబాలు పూరిళ్లలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన నిర్వహించారు. నిజంగానే ఆయా ప్రాంతాల్లో పూరిళ్లు ఉన్నాయా? వాటిలో అర్హులైన పేద కుటుంబాలే నివసిస్తున్నారా? అనే అంశాలను ధృవీకరించారు. ఈ పరిశీలన అనంతరం 43 వేల కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా తేలినట్లు అధికారులు నిర్ధారించారు.

వివరాలు

జిల్లాల వారీగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలు

అర్హుల జాబితాను సంబంధిత ఎంపీడీవోలకు పంపించనున్నారు.

అనంతరం కలెక్టర్ల ఆమోదానికి పంపించి, చివరిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనుమతి తెలిపిన తర్వాత గుడిసెల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేస్తారు.

ఈ మొత్తం ప్రక్రియను వారం నుంచి పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

సర్వే ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 5,421 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నాయి.

భూపాలపల్లి జిల్లాలో 3,328 కుటుంబాలు, నల్గొండ జిల్లాలో 3,142 కుటుంబాలు, మెదక్ జిల్లాలో 2,955 కుటుంబాలు గుడిసెల్లో జీవనం సాగిస్తున్నట్లు తేలింది.

వివరాలు

తొలి ప్రాధాన్యం గుడిసె వాసులకే..

క్యూర్ పరిధిని మినహాయించి పరిశీలిస్తే, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 58 కుటుంబాలు, రంగారెడ్డి జిల్లాలో 318 కుటుంబాలు పూరిళ్లలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అలాగే జగిత్యాల జిల్లాలో 356 కుటుంబాలు, కరీంనగర్ జిల్లాలో 359 కుటుంబాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 399 కుటుంబాలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు సర్వేలో వెల్లడైంది.

రెండో విడతలో క్యూర్ పరిధిని మినహాయించి 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో మొదటి ప్రాధాన్యంగా పూరిళ్లలో నివసిస్తున్నట్లు గుర్తించిన పేద కుటుంబాలకే మంజూరు పత్రాలు అందజేయనున్నారు.

నియోజకవర్గాల వారీగా వీరికి ఇళ్లను కేటాయించిన అనంతరం, మిగిలిన ఎల్-1 జాబితాలోని అత్యంత పేద లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రభుత్వం ద్వారానే ఇళ్ల నిర్మాణంపై పరిశీలన..

ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని దశలవారీగా చేపడితే, ఆ పనుల పురోగతికి అనుగుణంగా బిల్లులను ప్రభుత్వం విడుదల చేస్తోంది.

అయితే గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలు ముందుగా సొంతంగా డబ్బులు వెచ్చించి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే పరిస్థితిలో ఉండకపోవడంతో, అలాంటి వారికి హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలోనే ఇళ్లను నిర్మించి అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

43 వేల కుటుంబాలకు షీర్‌వాల్ సాంకేతికతతో ఇళ్లు నిర్మించి అందిస్తే లబ్ధిదారులపై ఆర్థిక భారం పడదని అధికారులు భావిస్తున్నారు.

ఇందుకోసం ఆసక్తి చూపే స్టార్టప్ సంస్థలు, గుత్తేదారుల సహకారంతో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT