జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ
జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది. వారణాసిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను పటిష్ట భద్రతా నడుమ చేపట్టారు. ఉదయం 7 గంటలకే మసీదు ప్రాంగణానికి చేరుకున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం శాస్త్రీయ సర్వేని ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటలకు వరకు రెండో దఫా సర్వే నిర్వహించనున్నారు. 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదును, హిందూ దేవాలయంపై పునః నిర్మించారా లేదా అనే అంశాన్ని నిగ్గు తేల్చేందుకు ఈ సర్వేని చేపట్టారు.
ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారంటున్న హిందూ సంఘాలు
మరోవైపు సర్వేని వ్యతిరేకిస్తూ వస్తున్న అంజుమన్ ఇంతేజామియా (మసీదు కమిటీ), తాజాగా సర్వేను బహిష్కరించింది. సదరు మసీదు స్థానంలో ఒకప్పుడు హిందూ దేవాలయం(శివాలయం) ఉండేది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదేశాలతో ఆలయాన్ని కూల్చి, దాని స్థానంలో మసీదును నిర్మించారని హిందూ సంఘాలు న్యాయపోరాటానికి దిగాయి. ఈ మేరకు మసీదులో సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని, దానిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు జూలై 21న ASIకి ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ మసీద్ కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా ఆగస్టు 3న సర్వేకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే సమయంలో నిర్మాణాలకు నష్టం జరగకుండా చూడాలని హైకోర్టు స్పష్టం చేసింది.