ప్రకాశం వైసీపీలో అలజడి.. సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం సస్పెస్షన్ వేటు వేసింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డి కావడం చర్చనీయాంశంగా మారింది. భవనం శ్రీనివాసరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తునట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భవనం శ్రీనివాసరెడ్డిది పర్చూరు నియోజకవర్గం. ఆయన భార్య ఇంకొల్లు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. పర్చూరులో భవనం చాలా కీలక నేతగా ఉన్నారు. అలాంటి నేతను సస్పెండ్ చేయడం గమనార్హం.
భవనంపై వేటు విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లిన బాలినేని
పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్, భవనం శ్రీనివాసరెడ్డి మధ్య కొంతకాలంగా తీవ్రమైన విభేదాలున్నాయి. దీంతో ఆమంచి ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం భవనం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. భవనంను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి బాలినేని ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే భవనంను సస్పెండ్ చేసిన విషయాన్ని బాలినేని.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భవనం శ్రీనివాసరెడ్డితో పాటు మార్కాపురం వైసీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. స్థానిక ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిపై ఆయన బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.