Mumbai: నకిలీ బార్క్ శాస్త్రవేత్త వద్ద కీలక సమాచారం..అణు డేటా, డజన్ల కొద్దీ మ్యాప్‌లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ అణు పరిశోధనా సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పేరుతో నకిలీ శాస్త్రవేత్తగా వ్యవహరిస్తున్న అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనీ ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, అక్తర్ వద్ద నుంచి అణు కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైన డేటా (nuclear data)తో పాటు 14 మ్యాప్‌లును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఏమైనా సున్నితమైన సమాచారం ఉందేమో అనేది అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. గత వారం ముంబయిలో అరెస్టయిన అక్తర్ వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అలాగే బార్క్‌కి చెందిన రెండు నకిలీ ఐడీ కార్డులు కూడా పట్టుబడ్డాయి.
వివరాలు
నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి దుబాయ్, ఇరాన్ వంటి దేశాలకు..
అతడు గత కొన్ని నెలలుగా అనేక అంతర్జాతీయ ఫోన్ కాల్స్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.ఆ కాల్స్ వివరాలను ప్రస్తుతం పోలీసులు విశ్లేషిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం,అక్తర్‌కి విదేశీ నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. జంషెడ్‌పూర్ కు చెందిన ఈ వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో కొంతకాలం దుబాయ్‌లో ఉన్నాడు. తర్వాత దుబాయ్ అధికారులు అతడిని బహిష్కరించడంతో,మరలా కొత్త నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి దుబాయ్, ఇరాన్ వంటి దేశాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇరానియన్ గూఢచార సంస్థలతో చేసిన ఒప్పందం ద్వారా పొందిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. గూఢచర్య కార్యకలాపాలు,నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్ నడిపిన కేసులో,అక్తర్ సోదరుడు మహమ్మద్ అదిల్ హుస్సేనీను కూడా ఇటీవల పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.