Nara Lokesh: జులై మూడో వారంలో'తల్లికి వందనం'.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పథకం అమలుతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. తల్లికి వందనం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుల తల్లుల ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. జులై మూడో వారంలో అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ఈ నెల 29న 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం
ఈ సందర్భంగా పది, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు ఈ నెల 29న 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు చర్చించారు. అలాగే జులై మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు, మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు తదితర అంశాలపై కూడా మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్‌తో పాటు వివిధ కోర్సులకు సంబంధించిన మొత్తం 12 రకాల ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్‌లు జాప్యం లేకుండా నిర్ణీత గడువులో నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌన్సెలింగ్ తేదీలను ముందుగానే ఖరారు చేయాలని సూచించారు.
వివరాలు
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపుపై కూడా అధికారులు దృష్టి సారించాలని లోకేశ్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ముఖ్యంగా మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు మంచి డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు ముందుకు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. థాపర్ ఇన్‌స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్‌బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్‌ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో తమ విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.
వివరాలు
జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులకు సూచన
అలాగే జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్‌సీసీ డైరెక్టరేట్ కీలకంగా ఉపయోగపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పీడీ బి. శ్రీనివాసరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.