Paternity Leave: బిడ్డ పుట్టినప్పుడు తండ్రులకూ 15 రోజుల పితృత్వ సెలవులు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు ప్రభుత్వం పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులు (Paternity Leave) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు ఈ సెలవులు కల్పించనుంది. బిడ్డ జన్మించే సమయంలో భార్యకు తోడుగా ఉండటంతో పాటు, నవజాత శిశువు సంరక్షణలో తండ్రి కూడా భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు
ఈ నిబంధనల ప్రకారం.. బిడ్డ పుట్టడానికి 15 రోజుల ముందు నుంచే తండ్రులు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు.
ఒకవేళ అప్పుడు సెలవులు తీసుకోకపోతే, శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఎప్పుడైనా 15 రోజుల సెలవులను వినియోగించుకోవచ్చు.
తమిళనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్న వివాహిత పురుష ఉద్యోగులందరికీ ఈ సదుపాయం వర్తించనుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల పాటు ప్రసూతి సెలవులు (Maternity Leave) అందుబాటులో ఉన్నాయి.
తాజాగా పురుష ఉద్యోగులకు కూడా 15 రోజుల పితృత్వ సెలవులు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
వివరాలు
ఈ ఉద్దేశంతోనే పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవలు
ప్రసవ సమయం తల్లికి, నవజాత శిశువుకు ఎంతో కీలకమైనదని ప్రభుత్వం పేర్కొంది.
ఈ సమయంలో భర్త అందించే సహకారం భార్యకు శారీరకంగా, మానసికంగా ఎంతో తోడ్పడుతుందని తెలిపింది.
అలాగే పుట్టిన బిడ్డ సంరక్షణలో తండ్రి కూడా చురుగ్గా పాల్గొనేందుకు ఈ సెలవులు ఉపయోగపడతాయని వెల్లడించింది.
పిల్లల పెంపకం అనేది కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ ఉద్దేశంతోనే పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవుల సదుపాయాన్ని కల్పించినట్లు వివరించింది.