Loading...
Tamil Nadu Govt Employees: తమిళనాడు ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తప్పనిసరి..
ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తప్పనిసరి..

Tamil Nadu Govt Employees: తమిళనాడు ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తప్పనిసరి..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ ఉద్యోగుల్లో పారదర్శకతను పెంచడంతో పాటు అవకతవకలకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై ప్రతీ ఏడాది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. సాయికుమార్ అధికారిక సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి-1973లోని రూల్ 7(3)కు చేసిన సవరణల ఆధారంగా ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వివరాలు 

IFHRMSలో ఆస్తులు, అప్పుల వివరాల నమోదు

ఆల్ ఇండియా సర్వీస్ (AIS) అధికారులను మినహాయించి.. మిగిలిన సచివాలయ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా న్యాయమూర్తులు, ప్రభుత్వ శాఖల అధిపతులు,తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బంది తమ ఆస్తుల వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

ఇందుకోసం 'ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్'(IFHRMS) వెబ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆస్తులు, రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసేందుకు పోర్టల్‌లో మూడు ప్రత్యేక ఫారమ్‌లను ఏర్పాటు చేశారు.

ఫామ్-1లో భూములు, భవనాలు, ఫ్లాట్లు,సొంత ఇళ్లు తదితర స్థిరాస్తుల వివరాలను నమోదు చేయాలి.

ఫామ్-2లో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు వంటి చరాస్తులకు సంబంధించిన వివరాలను పొందుపరచాలి.

వివరాలు 

2026 అక్టోబర్ 31లోగా తొలి నివేదిక

ఇక ఫామ్-3లో ఉద్యోగి తీసుకున్న బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు, ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.

2025 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులు కొనుగోలు చేసిన ఆస్తులు, ఉన్న అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలను 2026 అక్టోబర్ 31లోగా IFHRMS పోర్టల్‌లోని సంబంధిత ఆన్‌లైన్ ఫారమ్‌లలో నమోదు చేయాలి.

వివరాలను తుది సమర్పణ చేసిన తర్వాత ఉద్యోగులు తమ ఆస్తుల నివేదికను డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవచ్చు.

ఇకపై ప్రతీ ఏడాదికి కూడా ప్రభుత్వం నిర్దిష్ట గడువును నిర్ణయించింది.

ప్రతి ఏడాది డిసెంబర్ 31 నాటికి ఉన్న లేదా ఆ ఏడాదిలో కొనుగోలు చేసిన ఆస్తులు, అప్పుల వివరాలను తదుపరి ఏడాది మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ADVERTISEMENT

వివరాలు 

IFHRMSలో వివరాలు ఎలా నమోదు చేయాలి?

ఉదాహరణకు 2026 డిసెంబర్ 31 వరకు కొనుగోలు చేసిన ఆస్తులు, ఉన్న అప్పుల వివరాలను 2027 మార్చి 31లోగా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగులు ముందుగా తమ IFHRMS పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.అనంతరం 'Employee Self Services' విభాగాన్ని ఎంచుకోవాలి.

అక్కడ 'Property Filing' ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'Apply'ను ఎంపిక చేయాలి.

ఆ తర్వాత ఫామ్-1, ఫామ్-2, ఫామ్-3లో అడిగిన వివరాలను పూర్తిగా నమోదు చేయాలి.

సమాచారం నమోదు చేసిన అనంతరం 'Review and Submission' ద్వారా అన్ని వివరాలను మరోసారి పరిశీలించాలి.

వివరాలు సరైనవేనని నిర్ధారించుకుని డిక్లరేషన్‌ను అంగీకరించిన తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.

చివరగా సమర్పించిన నివేదికను ప్రింట్ తీసుకోవడం లేదా డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరచుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రమోషన్లలోనూ ఈ వివరాలు కీలకం

ఆస్తులు, అప్పుల వివరాల సమర్పణకు సంబంధించి ఉద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

ప్రతి ఉద్యోగి తన IFHRMS ఐడీ, పాస్‌వర్డ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఆస్తుల వివరాల నివేదికను సమర్పించిన తేదీని ఉద్యోగి వార్షిక రహస్య నివేదిక (ACR)లో తప్పనిసరిగా నమోదు చేస్తారు.

అంతేకాదు.. ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు రూపొందించే ప్యానెల్ జాబితాలో ఆస్తులు, అప్పుల వివరాల సమర్పణను కూడా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు.

నిర్దేశించిన గడువులోగా ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించకపోతే దాన్ని ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది.

దీంతో ఇకపై తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను నిర్ణీత గడువుల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి కానుంది.

ADVERTISEMENT