
Tamil Nādu: విపత్తులకు కవచం - ఉపాధికి ఆధారం: మడ అడవుల పునరుద్ధరణలో తమిళనాడు
ఈ వార్తాకథనం ఏంటి
సునామీలు, తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సముద్ర తీరానికి రక్షణ కవచంలా నిలిచే మడ అడవులు గత కొంతకాలంగా విధ్వంసానికి గురైపోతున్నాయి. ఈ విలువైన పచ్చని వరాలను తిరిగి పునరుద్ధరించేందుకు తమిళనాడు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అయితే ఈ అడవుల పునరుద్ధరణలో అసలు సమస్యలు ఏమిటంటే.. అవి ఎలాంటి పద్ధతుల్లో చేపట్టాలి? ఎలాంటి మొక్కలను నాటాలి? అన్నవి పెద్ద సవాళ్లుగా నిలిచాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు అధికారులు రెండు సంవత్సరాల పాటు వివిధ పరిశోధనలు నిర్వహించారు. దేశీయ, అంతర్జాతీయ విధానాలను పరిశీలించారు. ఈ విశ్లేషణల నేపథ్యంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మడ అడవులను పునరుద్ధరించాలనే తుదినిర్ణయానికి వచ్చారు.
వివరాలు
పడవల్లో వెళ్లి చేపలు పట్టుకునేలా...
తమిళనాడులో మడ అడవుల పునరుద్ధరణకు ప్రత్యేకంగా రూపొందించిన విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. ముందుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో చేపల పెంపకానికి అనుకూలంగా కాలువల్ని తవ్వుతారు. ఇవి చేప ముళ్లు, ఆకుల ఆకారంలో డిజైన్ చేస్తారు. మిగిలిన భూభాగంలో పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ విధానంలో ఒకవైపు మొక్కలు పెరిగి సముద్రపు అలల తాకిడికి అడ్డుగోడగా పనిచేస్తూ తీర ప్రాంతాన్ని రక్షిస్తాయి. మరోవైపు సమీప గ్రామాల మత్స్యకారులు పడవల ద్వారా కాలువల్లోకి వెళ్లి చేపలు పట్టుకొని తమకు ఉపాధి పొందే అవకాశాన్ని పొందుతున్నారు. ఈ విధంగా ప్రకృతి పరిరక్షణతో పాటు జీవనోపాధిని కలగజేస్తూ దోహదపడుతోంది.
వివరాలు
10,000 హెక్టార్లకు పైగా పెరిగిన మడ అడవులు
ఈ ప్రాజెక్టును 2023 సంవత్సరం నుంచి తమిళనాడులోని 10 తీర జిల్లాల్లో అమలు చేస్తున్నారు. "గ్రీన్ తమిళనాడు మిషన్"లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీల్లో మొక్కలను పెంచి, వాటిని పునరుద్ధరించాల్సిన మడ అడవుల ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరుద్ధరించిన ఈ అడవులు ప్రస్తుతం జీవ వైవిధ్య భూభాగాలుగా రూపాంతరం చెందుతున్నాయి. నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో 4,500 హెక్టార్ల మేర మడ అడవులు ఉండగా, ఇప్పుడు వాటి విస్తీర్ణం 10,000 హెక్టార్లకు పైగా పెరిగింది. శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, ఈ అడవులు సుమారు 8.73 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను పీల్చుకునే సామర్థ్యం కలిగివున్నాయి.
వివరాలు
ముత్తుపేట - ఆదర్శంగా ఎదుగుతున్న మడ అడవులు
తిరువారూరు జిల్లాలోని ముత్తుపేట ప్రాంతంలో మడ అడవుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 1,350 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పనులు చేపట్టగా, ఇప్పటికే 707 హెక్టార్లలో పని పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 16 లక్షల మొక్కలు నాటారు. ఈ ప్రాజెక్టు వల్ల అక్కడి ఆరు గ్రామాల మత్స్యకారులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఇది ఒకవైపు పర్యావరణ పరిరక్షణకు మార్గం అయితే, మరోవైపు గ్రామీణ జనాలకు జీవనోపాధిని కల్పించే అనుసంధానిత మోడల్‌గా నిలుస్తోంది.