Loading...
Mid Day Meal: మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన
మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన

Mid Day Meal: మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో (మిడ్-డే మీల్ స్కీమ్) కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను అధికారికంగా ముఖ్యమంత్రి విజయ్‌కు పంపించామని,ప్రస్తుతం ఆయన పరిశీలనలో ఉందని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులో ఎన్నో దశల్లో అభివృద్ధి చెందిందని మంత్రి గుర్తుచేశారు. జస్టిస్ పార్టీ హయాంలో ప్రారంభమైన ఈ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ విస్తరించారని చెప్పారు. అనంతరం కరుణానిధి విద్యార్థుల భోజనంలో గుడ్లను చేర్చగా,ఎంజీఆర్,జయలలిత హయాంలో మరిన్ని పోషకాహార అంశాలను జోడించి పథకాన్ని మరింత బలోపేతం చేశారని వివరించారు.

వివరాలు 

వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించే అవకాశాలపైనా ప్రభుత్వం పరిశీలన

అదేతరహాలో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను తాను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కోవిద్యార్థి మధ్యాహ్న భోజనం కోసం సుమారు రూ.15ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

అలాగే ఉదయం అల్పాహార పథకంలో ప్రస్తుతం అందిస్తున్న ఉప్మా వంటి వంటకాల స్థానంలో మరింత పోషకవిలువలు,రుచిలో వైవిధ్యం కలిగిన ఆహారాన్ని అందించే అవకాశాలపైనా ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోందని చెప్పారు.

అయితే,మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీని చేర్చే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఈప్రతిపాదన వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థికభారం,అమలు విధానం,పోషకాహార ప్రమాణాలు,సరఫరా వ్యవస్థ వంటి అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించిన అనంతరం ప్రభుత్వం అధికారిక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ADVERTISEMENT