Tamil Nadu rain: భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం..కొనసాగుతున్న సహాయక చర్యలు
తమిళనాడులో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం, నౌకాదళం సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సమయంలో దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో చిక్కుకుపోయిన అనేక మందిని రక్షించారు. భారత నావికాదళ సిబ్బంది బుధవారం మధురై,టుటికోరిన్‌లలో వరద బాధిత ప్రజలకు ఆహారం, సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తమిళనాడుకు కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయం బుధవారం హామీ ఇచ్చింది. తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐఏఎఫ్ హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తోందని రక్షణ మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
టుటికోరిన్‌లోని అలంతలైలో ఇళ్లు, వీధులు జలమయం
రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. రిలీఫ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డిసెంబరు 20, 2023న మధురై విమానాశ్రయంలో ఫస్ట్ లైట్ వద్ద ఇండియా కోస్ట్ గార్డ్ ALHలో రాష్ట్ర పరిపాలన అందించిన ఆహార ప్యాకెట్లు,ఇతర రిలీఫ్ మెటీరియల్‌లను లోడ్ చేసిందని పేర్కొంది. అదేవిధంగా తూత్తుకుడి జిల్లా కురుకత్తూరు వరద ప్రభావిత ప్రాంతంలో ముగ్గురు ప్రయాణికులతో కూడిన కారును భారత సైన్యం రక్షించింది. భారీ వర్షాల మధ్య తమిళనాడులోని టుటికోరిన్‌లోని అలంతలైలో ఇళ్లు, వీధులు జలమయమయ్యాయి. దక్షిణాది జిల్లాలు, ప్రత్యేకించి తిరునెల్వేలి, టుటికోరిన్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం, వరదలు నమోదయ్యాయని అధికారులు గతంలోనే చెప్పారు.
ఆ ప్రాంతాలలో వచ్చే ఆరు రోజుల పాటు తేలికపాటి వర్షాలు
తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో వచ్చే ఆరు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం హెచ్చరించింది. డిసెంబర్ 21 నుండి 26 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.