Polling Percentage Details: తమిళనాడు,పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 152 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా, తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటర్లు తమ హక్కును వినియోగిస్తున్నారు. అదే సమయంలో గుజరాత్‌లోని ఉమ్రేఠ్, మహారాష్ట్రలోని బారామతి, రాహురీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ఉదయం 11 గంటల వరకూ తమిళనాడులో 37.56 శాతం, పశ్చిమ బెంగాల్ తొలి విడతలో 41.11 శాతం పోలింగ్ నమోదైంది.
వివరాలు
తమిళనాడులో ప్రముఖుల ఓటింగ్
శివగంగ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఓటు వేశారు. భాజపా నేత ఖుష్బూ, నటి త్రిష కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. ఆయన తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి చెన్నైలో ఓటు వేశారు. నటుడు విక్రమ్, ఆయన కుమారుడు ధ్రువ్ విక్రమ్ చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వివరాలు
'మాకు మార్పు అవసరం లేదు'
ఎంఎన్‌ఎం అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శ్రుతి హాసన్ తో కలిసి ఓటు వేశారు. మరో ప్రముఖ నటుడు రజనీకాంత్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. దక్షిణ చెన్నైలోని తిరువన్మియూరులో నటుడు అజిత్ ఓటు వేశారు. ఓటేసిన అనంతరం ఆయన 'మాకు మార్పు అవసరం లేదు' అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంపై స్టాలిన్ స్పందిస్తూ, "ఆయన చెప్పింది సరైనదే" అని వ్యాఖ్యానించారు. అయితే అజిత్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన మేనేజర్ స్పష్టం చేశారు.