LOADING...
Tata Power: నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్‌.. వెయ్యి మందికి ఉద్యోగాలు
నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్‌.. వెయ్యి మందికి ఉద్యోగాలు

Tata Power: నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్‌.. వెయ్యి మందికి ఉద్యోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగోట్‌-వేఫర్‌ తయారీ రంగంలో భారీ పెట్టుబడితో టాటా పవర్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. టాటా పవర్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ రూ.6,675 కోట్ల వ్యయంతో ఈ కీలక ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని ఇఫ్కో సెజ్‌లో 200 ఎకరాల విస్తీర్ణంలో (దీనిలో 33 శాతం గ్రీన్‌ బఫర్‌ ఏరియాతో సహా) ఈ యూనిట్‌ స్థాపించనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే సుమారు వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు 

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో టాటా సంస్థ

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో టాటా సంస్థ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా 4,721 మెగావాట్ల సౌర విద్యుత్‌, 1,034 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. అంతేకాకుండా 700కు పైగా నగరాల్లో దాదాపు 3 వేల మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్‌ ద్వారా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ఎగుమతులపై కూడా సంస్థ దృష్టి సారించింది.

వివరాలు 

రెండేళ్లలో ఉత్పత్తిలోకి 

ఇంగోట్‌, వేఫర్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణాన్ని 2028 జనవరి నాటికి పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని టాటా పవర్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో 120 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు.భవిష్యత్తులో విస్తరణ అవసరాల కోసం మరో 80 ఎకరాలను వినియోగించుకునే ప్రణాళిక రూపొందించారు. సంస్థకు కేటాయించే భూములను సెజ్‌ పరిధి నుంచి మినహాయించాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది.

Advertisement

వివరాలు 

విద్యుత్‌ అవసరాల కోసం ప్రత్యేక సోలార్‌ ప్లాంటు 

ఇంగోట్‌, వేఫర్‌ తయారీ యూనిట్‌కు అవసరమైన విద్యుత్‌ను స్వయం వినియోగం కోసం క్యాప్టివ్‌ విధానంలో 200 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన భూములను నెడ్‌క్యాప్‌ ప్రత్యేకంగా కేటాయించనుంది. ఈ భూకేటాయింపు ప్రక్రియను ఆరు నెలల లోపే పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు అవసరాల కోసం కనిగిరి రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా రోజుకు 12.6 మిలియన్‌ లీటర్ల నీటిని వినియోగించనున్నారు.

Advertisement

వివరాలు 

నెల్లూరు-నాయుడుపేటగా సోలార్‌ హబ్‌ 

నెల్లూరు, నాయుడుపేట ప్రాంతాలు భవిష్యత్తులో సౌర ప్యానళ్లతో పాటు ఇతర సోలార్‌ కాంపొనెంట్ల తయారీకి కేంద్రంగా మారనున్నాయి. నెల్లూరు జిల్లాలో ఇండోసోల్‌ సంస్థ 10 గిగావాట్ల సామర్థ్యంతో ఫోటో వోల్టాయిక్‌ సోలార్‌ ప్యానళ్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌ కోసం భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నాయుడుపేట సెజ్‌లో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థ ఇంగోట్‌, వేఫర్‌, సోలార్‌ సెల్స్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. వోల్ట్సన్‌ ల్యాబ్స్‌ సంస్థ కూడా సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌ తయారీ యూనిట్‌ను స్థాపిస్తోంది. తాజాగా టాటా పవర్‌ ఇంగోట్‌, వేఫర్‌ తయారీ యూనిట్‌ను ప్రకటించడంతో ఈ ప్రాంతం సోలార్‌ పరిశ్రమకు అనుకూల కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది.

వివరాలు 

చిప్‌ల తయారీలో కీలక పాత్ర 

సెమీకండక్టర్‌ రంగంలో ఉపయోగించే కంప్యూటర్‌ చిప్‌లు, ట్రాన్సిస్టర్లు, అలాగే సోలార్‌ సెల్స్‌ తయారీకి ఇంగోట్స్‌, వేఫర్‌లు కీలకంగా ఉపయోగపడతాయి. ఇంగోట్స్‌ అనేవి పెద్ద పరిమాణంలో ఉండే మెటల్‌ బ్లాక్‌లు కాగా, వేఫర్‌లు పలుచని సిలికాన్‌ పొరల రూపంలో ఉంటాయి. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడి భాగాలు, సౌర విద్యుత్‌ ఉత్పత్తి వంటి రంగాల్లో ఇవే మౌలిక పదార్థాలుగా పనిచేస్తాయి. వైర్లు, షీట్లు, యంత్రాల విడిభాగాల తయారీలో కూడా ఇంగోట్స్‌కు విస్తృత వినియోగం ఉంది. ఎలక్ట్రానిక్స్‌లో క్లిష్టమైన మైక్రో ఫ్యాబ్రికేషన్‌ ప్రక్రియల్లో వేఫర్‌ల పాత్ర కీలకం. ఈ కీలక భాగాలను ఇకపై దేశీయంగానే టాటా సంస్థ తయారు చేయనుంది.

Advertisement