Page Loader
N Chandrasekaran: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం,క్షమాపణ
అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం,క్షమాపణ

N Chandrasekaran: అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం,క్షమాపణ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత గురువారం అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదకర సంఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం ఎంతో బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందించిన ఆయన, మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలిపారు. లండన్‌కి వెళ్తున్న డ్రీమ్‌లైనర్ ఎయిరిండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఒక భవనంపై కూలిపోయిన సంఘటన అందరిని కలచివేసిందని ఆయన తెలిపారు.

వివరాలు 

బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం: చంద్రశేఖరన్ 

ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు మాటలు సరిపోవు అని చంద్రశేఖరన్ అన్నారు. "మా సంస్థ నిర్వహిస్తున్న ఎయిర్‌లైన్‌లో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం గుండెను తట్టినట్లుగా ఉంది. బాధిత కుటుంబాల పట్ల మా బాధ్యతగా, అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించేందుకు ఎయిరిండియా పూర్తిగా కట్టుబడి ఉంది. వారి పట్ల మా గాఢ సానుభూతి తెలియజేస్తూ, హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని అన్నారు.

వివరాలు 

పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది 

ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు. ప్రాథమిక నివేదికలు సిద్ధం కావడానికి కనీసం ఒక నెల సమయం పట్టవచ్చని అంచనా వేశారు. విమానం అత్యంత భద్రతా ప్రమాణాలతోనే కార్యకలాపాలు సాగిస్తోందని, ఇటీవలే నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి సాంకేతిక లోపాలు బయటపడలేదని ఆయన వివరించారు. అనేక ఊహాగానాలు వినిపిస్తున్నా,ఈ దుర్ఘటనకు కారణం ఏదైనా మానవ తప్పిదమా, టెక్నికల్ లోపమా, ఇంజిన్ సమస్యలవేనా అనే విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావడం వీలుకాదని స్పష్టం చేశారు.

వివరాలు 

AI171కి మంచి భద్రతా రికార్డు ఉందని స్పష్టం 

ప్రమాదానికి గురైన AI171 విమానం ఇప్పటివరకు మంచి సేఫ్టీ రికార్డును కలిగి ఉందని చంద్రశేఖరన్ తెలిపారు. కుడివైపు ఇంజిన్‌ను 2025 మార్చిలో ఓవర్‌హాలింగ్ సమయంలో మార్చినట్లు చెప్పారు. ఎడమవైపు ఇంజిన్‌కు చివరిసారిగా 2023 జూన్‌లో నిర్వహణ కార్యక్రమం జరిగినట్లు వివరించారు. తదుపరి నిర్వహణ షెడ్యూల్ ప్రకారం 2025 డిసెంబర్‌లో చేయాల్సి ఉందని చెప్పారు. పైలట్లు అనుభవజ్ఞులే విమానాన్ని నడిపిన పైలట్లు అత్యంత అనుభవం కలవారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్య పైలట్ కెప్టెన్ సభర్వాల్‌కు 11,500 గంటలకుపైగా విమానయాన అనుభవం ఉందని, కో పైలట్ కుందర్‌కు 3,400 గంటలకుపైగా ప్రయాణ అనుభవం ఉన్నట్లు వెల్లడించారు.

వివరాలు 

బ్లాక్ బాక్స్ నివేదికకే అంతిమ నిర్ధారణ 

"ప్రస్తుతానికి ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణం ఏంటో చెప్పలేం. బ్లాక్ బాక్స్, ఇతర ఫ్లైట్ డేటా రికార్డర్ల విశ్లేషణ తర్వాతే వాస్తవాలపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు మేమంతా ఓర్పుతో వేచి ఉండాల్సిందే," అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు డీజీసీఏ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.