Indian Railways: తత్కాల్ టికెట్ బుకింగ్‌పై ఇండియన్ రైల్వేస్ బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు చేస్తూ ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం,బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం, ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో టోకెన్ తీసుకున్న తర్వాత ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయం వచ్చే వరకు వేచి ఉండాల్సి వస్తోంది. అనంతరం మళ్లీ రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.
వివరాలు
ఆగస్టు 1 నుంచి కొత్త బుకింగ్ సమయాలు
ఇకపై తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికే టికెట్ల పంపిణీ కూడా జరగనుండటంతో ప్రయాణికులు ఒకేసారి బుకింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.
పశ్చిమ మధ్య రైల్వే పరిధిలో కొత్త విధానం ప్రకారం ఏసీ తరగతుల తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 8:30 గంటల నుంచి 9:00 గంటల వరకు, నాన్-ఏసీ (స్లీపర్ సహా) తత్కాల్ టికెట్ల బుకింగ్ ఉదయం 9:00 గంటల నుంచి 9:30 గంటల వరకు నిర్వహించనున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో ఏసీ కోచ్‌ల తత్కాల్ టికెట్లు ఉదయం 9:00 నుంచి 9:25 గంటల మధ్య, స్లీపర్ తరగతి తత్కాల్ టికెట్లు 9:30 నుంచి 9:55 గంటల మధ్య అందుబాటులో ఉన్నాయి.
కొత్త విధానంతో ఈ సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వివరాలు
ప్రయాణికులకు మరింత సౌలభ్యం
ప్రస్తుత వ్యవస్థలో ఏసీ, స్లీపర్ తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8 గంటల నుంచే టోకెన్ల పంపిణీ ప్రారంభమవుతోంది.
అయితే ఏసీ తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావడంతో టోకెన్ తీసుకున్న ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
దీంతో వారు మళ్లీ రిజర్వేషన్ కౌంటర్‌కు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఒకేసారి టికెట్ బుకింగ్ పూర్తవడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు కౌంటర్ల వద్ద అనవసర రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది.
వివరాలు
దళారులపై నియంత్రణ కూడా లక్ష్యం
ప్రయాణికులకు పారదర్శకమైన సేవలు అందించడంతో పాటు దళారుల జోక్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ రైల్వే కమర్షియల్ మేనేజర్ సౌరభ్ కటారియా తెలిపారు.
కొత్త విధానం ప్రకారం ప్రతి రిజర్వేషన్ కౌంటర్‌లో ఏసీ తరగతికి గరిష్టంగా 10 టికెట్లు, నాన్-ఏసీ తరగతికి 15 టికెట్లు మాత్రమే బుక్ చేసే అవకాశం కల్పించనున్నారు.