Page Loader
YS Jagan Tour:జగన్‌  పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
జగన్‌ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి

YS Jagan Tour:జగన్‌  పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిని సందర్శించారు. ఈ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలను అవమానించేలా నేతలను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ, టీడీపీ నేతలు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొందరు టీడీపీ నాయకులు నల్లబెలూన్లు పట్టుకొని, ప్లకార్డులతో నిరసన తెలిపారు. "గో బ్యాక్ జగన్ మోహన్ రెడ్డి" అంటూ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతుండగా, వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారి మీద దాడికి యత్నించారు. దీనికి ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా అదే స్థాయిలో స్పందించడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

వివరాలు 

 ఘర్షణలో గాయపడిన పోలీసులు 

ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసిరుకున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో జగన్ పర్యటన ఉద్రిక్తతగా మారింది. ఈ క్రమంలో, "నీ డైవర్షన్ నాటకాలు ఆపు జగన్.. ఏ మూలకి వెళ్లినా అక్కడ మహిళలు నిన్ను వదిలిపెట్టరు. నీవు చేయిస్తున్న నీచమైన చర్యలకు క్షమాపణ చెప్పాల్సిందే" అంటూ తీవ్ర వ్యాఖ్యలు వినిపించాయి. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులు ఈ ఘర్షణలో గాయపడ్డారు. రెండు పార్టీల కార్యకర్తలు విసిరిన రాళ్లు, చెప్పులు పోలీసులపై పడటంతో వారికి తలకి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇరుపక్షాల కార్యకర్తలు కూడా గాయపడ్డారు.

వివరాలు 

మహిళలను గౌరవించాల్సిన బాధ్యతను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు 

పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులు జరగడంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన లోకేష్,మహిళలను గౌరవించాల్సిన బాధ్యతను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. "పొదిలిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై, పోలీసులపై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.రాళ్లు విసిరిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం.జగన్ మొన్న తెనాలిలో గంజాయి కేసులున్న రౌడీలకు ఓదార్పుయాత్ర చేశారు.ఇప్పుడు తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలుగా పిలిచిన వారిని సమర్థిస్తున్నారు.మీతల్లిని,చెల్లిని బయటకు తోసేసి,కోర్టుకు ఈడ్చారు.మీచెల్లి పుట్టుకపై కూడా దుష్ప్రచారం చేయించారు.అలాంటి మీరు ఇప్పుడు మహిళలను గౌరవిస్తారని నమ్మడం స్వార్థమే.మహిళలపై వైకాపా నేతలు చెప్పిన దురుసు మాటలకు,మహిళలపై చేసిన దాడులకు జగన్ క్షమాపణ చెప్పాలి,"అంటూ లోకేష్ డిమాండ్ చేశారు.

వివరాలు 

లోకేష్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం

ఇక మరోవైపు జగన్ ఈ పర్యటనలో మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాటానికి హెచ్చరిక ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ టూర్‌కు ఎక్కువ మంది ప్రజలు హాజరైనందున టీడీపీకి అసహనం వచ్చినట్లు వ్యాఖ్యానించింది.

వివరాలు 

లోకేష్ నీ ఆక్రోశం, నీ ఏడుపు ఎందుకో ప్రజలకు తెలుసు

"లోకేష్ నీ ఆక్రోశం, నీ ఏడుపు ఎందుకో ప్రజలకు తెలుసు. ధరలూ లేక కష్టాల్లో ఉన్న పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు జగన్ పొదిలికి వచ్చారు. ప్రజలు ప్రవాహంలా కదిలి వచ్చారు. అది చూసి నీకు జీర్ణం కాలేదు. అందుకే మహిళల్ని వినియోగించి,నిరసన ముసుగులో దాడులకు తెగబడ్డావు. కానీ ప్రజలు నీ కుట్రలను గుర్తించారు. ఇలాంటి హింసాత్మక రాజకీయాలు నీ తండ్రికి, నీకూ అలవాటు. ఎన్టీఆర్‌ను తొలగించేందుకు ఆయన సతీమణిపై తప్పుడు ప్రచారం చేశారన్న చరిత్ర మీ దగ్గరే ఉంది. నీ కుట్రలు, నీ నటన ప్రజలకు తెలిసినవే," అంటూ వైఎస్సార్సీపీ తమ సోషల్ మీడియా ఖాతాలో ఘాటుగా స్పందించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నల్లబెలూన్లు పట్టుకొని, ప్లకార్డులతో నిరసన తెలిపిన మహిళలు