పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్
తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పార్టీ విభాగం నాయకులపై చురకలు అంటించారు. పని చేయని నేతలకు ఇకపై పార్టీలో స్థానం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం ఎట్టిపరిస్థితుల్లోనూ వద్దన్న అధినేత, పని చేయలేని నేతలుంటే ఇప్పుడే తప్పుకోవాలని ఝలక్ ఇచ్చారు. ఒకవేళ తప్పుకోకుండా పార్టీకి నష్టం చేయాలని చూస్తే అవసరాన్ని, సమయాన్ని బట్టి తామే ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటామని తేల్చి చెప్పారు. తాను గట్టిగా మాట్లాడటం లేదని ఎవరూ అనుకోవద్దని, పని చేయకుంటే చర్యలు మాత్రం గట్టిగానే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
దసరా నాడే పార్టీ మేనిఫెస్టో రిలీజ్ : చంద్రబాబు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 స్థానాలకూ గట్టిగా పోటీనిచ్చేలా నాయకులు సంసిద్ధంగా ఉండాలన్నారు. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీ మినీ మేనిఫెస్టోపై ప్రతి ఇంటా చర్చ జరిగేలాగా చూడాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రజల మనసు తెలుసుకుని ప్రవర్తించాలని, జనం సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. మరోవైపు చట్టసభల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, బీసీలకు అగ్రతాంబుళం ఇచ్చింది తెలుగుదేశమేనని గుర్తు చేశారు. విజయదశమి సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని, అందులోనే బీసీల కోసం రూపొందించిన పథకాలను వివరిస్తామన్నారు.