'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న హింస, అరాచకాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. తనపై జరిగిన దాడులపై సీబీఐ(CBI)తో విచారణకు ఆదేశించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడులు జరుగుతున్నాయని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటి పోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంస్థలను ఉద్దేశపూర్వంగా విధ్వంసం చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నట్లు చంద్రబాబు వివరించారు.
75 పేజీల లేఖ పంపించిన చంద్రబాబు
ఏపీలోని విపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక విధ్వంసక పాలనకు తెరలేపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను కూల్చేయడంతో పాటు ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని నాశనం చేసినట్లు చెప్పారు. 2019 ఆగస్ట్ నుంచి ఇటీవలే అంగళ్లులో జరిగిన ఘటన వరకు తనపై అనేక దాడులు జరిగాయన్నారు. ఆయా ఘటనలకు సంబంధించి 75 పేజీల సారాంశాన్ని, దానికి సంబంధించిన వీడియోలను చంద్రబాబు లేఖకు జత చేశారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందటూ చంద్రబాబు లేఖలో వివరించారు.