
మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.
వెంటనే పారామిలిటరీ దళం (అస్సాం రైఫిల్స్)ను రాష్ట్రం నుంచి ఉపసంహరించుకోవాలని దాదాపు 40 మంది మైతీ ఎమ్మెల్యేలు కోరారు.
మణిపూర్‌లో శాంతి భద్రతల పునరుద్ధరణ, స్థిరత్వాన్ని సాధించుకునేందుకు రాష్ట్ర భద్రతా దళాలు, విశ్వసనీయమైన కేంద్ర బలగాలను పంపించాలని అభ్యర్థించారు.
మరోవైపు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 10 మంది కుకీ ఎమ్మెల్యేలు సైతం ప్రధానికి లేఖ రాశారు. అస్సాం రైఫిల్స్‌ను యథాతధంగా కొనసాగించాలని, వాటిని తొలగించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
DETAILS
అస్సాం రైఫిల్స్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారు: కుకీ ఎమ్మెల్యేలు
కుకీ,మైతీ వర్గాల మధ్య బఫర్ జోన్ సృష్టించేందుకు అస్సాం రైఫిల్స్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృషి చేస్తున్నట్లు గిరిజనులు వర్గ(కుకీ)ఎమ్మెల్యేలు తెలిపారు.
భారత్ లోనే అతిపురాతన దళం, అస్సాం రైఫిల్స్ ఆవిర్భావం నుంచి దేశ అంతర్గత రక్షణకు, బాహ్య రక్షణకు కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్, BSF, ITBP, RAF, CRPF తదితర కేంద్ర బలగాలు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నట్లు కుకీలు వివరించారు.
రాష్ట్రంలోని హింసకాండను కట్టడి చేసేందుకు కేంద్రం అస్సాం రైఫిల్స్‌ను మోహరించింది. మైతీ సామాజిక వర్గానికి ఎస్టీ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కుకీలు ఆందోళన బాట పట్టారు.దీంతో 3 నెలలకు పైగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.