LOADING...
Andhra Pradesh: ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1
ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1

Andhra Pradesh: ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
09:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నాలుగు స్థానాల్లో మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీకి,ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించాలని కూటమి నేతలు అంగీకరించారు. ఈ మేరకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, ఎస్‌ఐఆర్‌ అంశం, రాజ్యసభ స్థానాల కేటాయింపు వంటి కీలక విషయాలపై విస్తృతంగా చర్చించారు.

వివరాలు 

నాలుగు స్థానాలూ కూటమికే.

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెదేపా, జనసేన పార్టీలు త్వరలో ప్రకటించనున్నాయి. వైకాపా పాలనలో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెదేపా తరఫున రాజ్యసభకు వెళ్లిన సానా సతీష్ పదవీకాలం త్వరలో ముగియనుంది. రాష్ట్ర శాసనసభలో కూటమికి ఉన్న మెజారిటీ కారణంగా ఈ నాలుగు స్థానాలూ ఎన్డీయే ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో ఈ స్థానాలను తెదేపా, జనసేన పరస్పర అవగాహనతో పంచుకున్నాయి.

వివరాలు 

గతంలో జరిగిన రాజ్యసభ భర్తీలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్‌. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో రెండు భాజపాకు, రెండు తెదేపాకు కేటాయించారు. ఆర్‌. కృష్ణయ్య భాజపా తరఫున మళ్లీ రాజ్యసభకు వెళ్లగా, విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానానికి భాజపా నేత పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. బీద మస్తాన్‌రావు తెదేపాలో చేరిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని తిరిగి ఆయనకే కేటాయించారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్‌ను రాజ్యసభకు పంపించారు.

Advertisement

వివరాలు 

రెండేళ్ల పాలనపై ప్రజల్లోకి వెళ్లనున్న కూటమి

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేందుకు పలు కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్డీయే నేతల సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పాలనా విజయాలను ప్రజలకు చేరవేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

Advertisement

వివరాలు 

మూడు నగరాల్లో భారీ బహిరంగ సభలు

సంక్షేమ కార్యక్రమాలపై ఈ నెల 9న తిరుపతిలో, పరిపాలన అంశాలపై 12న అమరావతిలో, అభివృద్ధి కార్యక్రమాలపై 15న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. జిల్లాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపట్టనున్నామని, వాటి పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ అంశంపైనా సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వివిధ వర్గాల ప్రజలకు అందిన ప్రయోజనాలను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరిస్తామని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అలాగే రాబోయే మూడేళ్ల పాలనకు సంబంధించి సమగ్ర రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు.

Advertisement