Tdp-Janasena: టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ.. సమన్వయ భేటీలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జిల్లాల వారీగా ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో ఉమ్మడి సభలు నిర్వహించనున్నారు. ఆయా సభల్లో ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. మరోవైపు అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశాల్లో ప్రతి 15 రోజులకోసారి సమన్వయ కమిటీ సమావేశవ్వాలని తీర్మానించుకున్నారు. తదుపరి సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
ఉమ్మడి మేనిఫెస్టోకి కమిటీ
ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై ఇరు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయిడు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని, రైతులు కరువుతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రైతులకు కరవు సాయం, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. రోడ్ల దుస్థితిపై ఉమ్మడి కార్యాచరణ వచ్చే శుక్ర, శనివారాల్లో చేస్తామన్నారు. బీసీలపై దాడులకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. టీడీపీ-జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసుల్లో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. దిశా యాప్ ఓ బోగస్ యాప్ అని, దిశా చట్టం లేకుండా దిశా యాప్ బలవంతంగా పెట్టి డౌన్ లోడ్లు చేయిస్తున్నారని మండిపడ్డారు.