Palnadu: చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల గృహ నిర్బంధం టీడీపీ నేతలు
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు గురువారం 'ఛలో మాచర్ల' కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనల్లో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
పదిరోజులుగా 144 సెక్షన్
గాయపడిన తమ కార్యకర్తలను పరామర్శించలేక పోవడంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. పల్నాడులో పదిరోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని, దాడులు చేసిన వారిపై కేసులు పెట్టారు పోలీసులు. నిందితులుగా ఉన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.