తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు హార్ట్ ఎటాక్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ బుధవారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వైవీబీ అస్వస్థతను గమనించిన కుటంబసభ్యులు, హుటాహుటిన ఆయన్ను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. స్పందించిన డాక్టర్ల బృందం, రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి ప్రాణా పాయం లేదని చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. యాంజియోగ్రామ్ అనే గుండెకు సంబంధించిన పరీక్షలు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. అయితే ఏపీ స్థానిక సంస్థల అభివృద్ధికి వైవీబీ రాజేంద్రప్రసాద్ విశేష కృషి చేశారు. దీంతో పాటు లోకల్ ప్రజా ప్రతినిధులకు విధులు, నిధులు, అధికారాల కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారనే పేరు సంపాదించుకున్నారు.
నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరు ప్రతిష్టలు
వైవీబీ రాజేంద్ర ప్రసాద్ నిబద్ధత కలిగిన నాయకుడిగా ఏపీ పాలిటిక్స్ లో కీర్తి గడించారు. 2021 జనవరి నాటికి రాజేంద్ర ప్రసాద్ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గమనార్హం. స్వాతంత్ర్య దినోత్సవం రోజు పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా వందనం చేయించాలని అప్పట్లో ఏపీ సర్కార్, ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ లోకల్ బాడీ ప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలే జాతీయ జెండాను ఎగురవేయాలని పోరాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని, పంచాయతీ హక్కులను ప్రభుత్వమే నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ మేరకు సర్కార్ జీవోలను తప్పుపడుతూ వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలన్నారు.