Andhra Pradesh: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల హవా.. గ్రామాల్లో కూటమి జోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలపరిచిన అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో ఉన్న గ్రామాల్లో కూటమి మద్దతుదారులు సత్తా చాటుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ల నుంచే కూటమి బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. సాయంత్రం సమయానికి అందిన అనధికారిక సమాచారం ప్రకారం, చాలా గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను టీడీపీ మద్దతుదారులు దక్కించుకుంటున్నారు.
వివరాలు
అత్యధికంగా ఏలూరులో 84.83 శాతం, విజయనగరంలో 83.33 శాతం నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 74.67శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్‌లో ఏలూరు జిల్లా 84.83శాతంతో మొదటి స్థానంలో నిలవగా,విజయనగరం జిల్లాలో 83.33 శాతం,చిత్తూరు జిల్లాలో 83.29 శాతం పోలింగ్ నమోదైంది.
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ మద్దతుదారులు విజయాలు నమోదు చేస్తున్నారు.
ముఖ్యంగా అన్నమయ్య,చిత్తూరు,శ్రీ సత్యసాయి జిల్లాల్లో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఫలితాలు వెలువడ్డాయి.
అన్నమయ్య జిల్లాలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందడం విశేషంగా మారింది.
ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
అక్కడ జరిగిన ఓట్ల లెక్కింపులో రీకౌంటింగ్ నిర్వహించిన అనంతరం కూటమి అభ్యర్థి కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ఈ ఫలితం స్థానికంగా చర్చనీయాంశమైంది.
వివరాలు
కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు.. రీపోలింగ్‌కు ఆదేశం
ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లెలో బ్యాలెట్ బాక్స్‌లో సిరా పోసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ గ్రామంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో కొందరు నిరసనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కి ఆందోళనకు దిగారు.
మరోవైపు కర్నూలు జిల్లా మండగిరిలోనూ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఆయా ప్రాంతాల్లో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.