Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం
దిల్లీ-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం దిల్లీ సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. హర్యానా పోలీసులు తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని రైతులు పేర్కొన్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానా నుంచి రాజధానిలోకి ప్రవేశించే మార్గంలో పోలీసులు భారీగా సిమెంట్ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల వాహన రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రైతులు ప్రభుత్వంతో మాట్లాడాలి- అనురాగ్ ఠాకూర్
రైతుల ఆందోళనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రైతులతో మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలకు రావాలని రైతు నేతలను ఆయన కోరారు. రైతుల డిమాండ్లు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. హింసకు పాల్పడవద్దని ఆందోళనకారులను కోరారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతు సంఘాలకు ఆయన సూచించారు. ప్రతిపక్షాల మాయలో రైతులు పడొద్దని చెప్పారు. సరిహద్దులో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులను మరోసారి చర్చలకు పిలిచింది.