Spicejet: సాంకేతిక సమస్యల కారణంగా.. రెండు స్పైస్‌జెట్ విమానాలు దారి మళ్లింపు
సోమవారం జరిగిన వేర్వేరు సంఘటనల్లో రెండు స్పైస్ జెట్ విమానాలు సాంకేతిక సమస్యల కారణంగా దారి మళ్లించబడ్డాయి. ఢిల్లీ నుండి షిల్లాంగ్ వెళ్తున్న విమానంలో గాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడంతో పాట్నా ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటనపై పాట్నా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ అంచల్ ప్రకాష్ స్పందిస్తూ, పక్షి ఢీకొనడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు.
చెన్నై నుండి కొచ్చికి వెళ్తున్న స్పైస్‌జెట్
ఇక మరో ఘటనలో చెన్నై నుండి కొచ్చికి వెళ్తున్న స్పైస్‌జెట్ క్యూ400 విమానంలో 117 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అది చెన్నై ఎయిర్‌పోర్టుకు తిరిగి చేరి అత్యవసర ల్యాండింగ్ చేసింది. స్పైస్‌జెట్ ప్రతినిధి మాట్లాడుతూ, సమస్య తలెత్తిన వెంటనే అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, ప్రయాణికులందరిని సురక్షితంగా దించామని చెప్పారు. ఇరు సంఘటనల్లోనూ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు.