LOADING...
Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి
తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి

Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. కేవలం వారం వ్యవధిలోనే రెండు జిల్లాల్లో కలిపి సుమారు 500 వీధి కుక్కలను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యంగా హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనలు మూగజీవాల పట్ల చూపుతున్న అమానవీయ వైఖరిని వెలుగులోకి తెచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే పేరుతోనే కొందరు సర్పంచ్‌లు ఈ చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

కుక్కలను చంపడానికి ఇద్దరు వ్యక్తులను నియమించుకున్న గ్రామ సర్పంచ్‌లు

హనుమకొండ జిల్లాలోని శాయంపేట,అరేపల్లి గ్రామాల్లో జనవరి 6 నుంచి 9 మధ్యకాలంలో దాదాపు 300 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లు లేదా విషం ఇచ్చి చంపినట్లు సమాచారం. ఈ పనికి ఇద్దరు వ్యక్తులను గ్రామ సర్పంచ్‌లు నియమించుకున్నారని తెలిసింది. మృతిచెందిన కుక్కల కళేబరాలను గ్రామాల శివార్లలో పూడ్చిపెట్టారు.జంతు సంరక్షణ సంస్థలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పూడ్చిపెట్టిన కళేబరాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.విషపదార్థాల ఆనవాళ్లు గుర్తించేందుకు విసెరా నమూనాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా సర్పంచ్‌లు,వారి భర్తలు,డిప్యూటీ సర్పంచ్,ఇద్దరు గ్రామ కార్యదర్శులు, ఇద్దరు డైలీ వేజ్ కార్మికులు కలిపి మొత్తం 9మందిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్-1960 కింద కేసులు నమోదు చేశారు.

వివరాలు 

ఐదుగురు సర్పంచ్‌లతో పాటు ఒక నియమించుకున్న వ్యక్తిపై పోలీసులు కేసులు

ఇక కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట, వాడి, బండారమేశ్వరపల్లి గ్రామాల్లో గత రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో దాదాపు 200 వీధి కుక్కలను ఇదే తరహాలో విషపూరిత ఇంజెక్షన్లతో హతమార్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు సర్పంచ్‌లతో పాటు ఒక నియమించుకున్న వ్యక్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం మీద రెండు జిల్లాల్లో ఒకే వారం వ్యవధిలో 500కు పైగా కుక్కలు చనిపోయాయి. 2025 డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో వీధి కుక్కల బెడదను తొలగిస్తామని ఇచ్చిన హామీలే ఈ దారుణాలకు కారణమని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Advertisement

వివరాలు 

తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన  జంతు సంరక్షణ కార్యకర్తలు  

ఈ ఘటనలపై జంతు సంరక్షణ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు అధికారులకు ఫిర్యాదులు చేశాయి. వీధి కుక్కల సమస్యకు పరిష్కారంగా యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనల ప్రకారం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. క్రూరంగా హత్యలు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలు సమస్యను తగ్గించకుండా మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో వీధి కుక్కల సమస్య ఎన్నేళ్లుగానో తీవ్రంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.

Advertisement

వివరాలు 

రేబిస్ మరణాల్లో 36 శాతం భారత్‌లోనే..

ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో 36 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 18,000 నుంచి 20,000 మంది రేబిస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 30 నుంచి 60 శాతం వరకు పిల్లలే ఉండటం ఆందోళన కలిగించే అంశం. రేబిస్ కేసుల్లో 99 శాతం కుక్కల కాటు లేదా దాడుల వల్లే సంభవిస్తున్నాయి. 2024-2025 కాలంలో లక్షల సంఖ్యలో కుక్కల కాటు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఎక్కువగా బాధితులవుతున్నారు. స్కూళ్లు, ఆసుపత్రుల వంటి సున్నిత ప్రాంతాల్లో కూడా కుక్కల దాడులు భయానక స్థాయికి చేరుతున్నాయి.

వివరాలు 

స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్  

ఈ వరుస ఘటనలు వీధి కుక్కల సమస్యను క్రూరత్వంతో కాకుండా మానవీయంగా, చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. హత్యలకు పాల్పడకుండా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వంటి శాస్త్రీయ విధానాల ద్వారానే ఈ సమస్యను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా తక్షణమే కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

Advertisement