తెలంగాణ: పారా మెడికల్ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపు
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పారా మెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారు. అయితే అన్ని రాష్ట్రాలు రిజర్వేషన్ ను అమలు చేయడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయం రాజకీయ అంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పీబీబీఎస్‌సీ నర్సింగ్ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10శాతం కల్పించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించిన సుప్రీంకోర్టు
ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాశారు. ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. అనేక మంది సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. దీంతో అప్పటి నుంచి పలు రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయి.