Assembly sessions : ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ప్రధాన చర్చ వీటిపైనే
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 3వ తేదీ నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల జులై 31న మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కాబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణలో మరికొన్ని నెలలో ఎన్నికలు రానుండటంతో ఆగస్టులోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుంది. ఎన్నికలకు ముందు జరగనున్న ఈ చివరి అసెంబ్లీ సమావేశాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సమావేశాల్లో దీనిపై చర్చ జరగనుంది. దాదాపుగా 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినేట్ చర్చించనుంది. భారీ వర్షాల కారణంగా రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనాలు వేయనున్నారు. అదే విధంగా ఆర్టీసీ సంస్థకు సంబంధించి అంశాలు, వారి జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినేట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.