LOADING...
Telangana: హైదరాబాద్‌పై వరాలు.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Telangana: హైదరాబాద్‌పై వరాలు.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి భారీ నిర్ణయాలు తీసుకుంది. రహదారుల అభివృద్ధి నుంచి తాగునీటి ప్రాజెక్టుల వరకూ పలు కీలక కార్యక్రమాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.4 వేల కోట్లకు పైగా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అదేవిధంగా హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ, నియోపొలిస్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమి కేటాయింపు, హైదరాబాద్‌లో అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాలకు కూడా ఆమోదం లభించింది.

వివరాలు 

సీఆర్‌ఎంపీ రెండో దశకు మంత్రివర్గం అనుమతి

రాజధాని పరిధిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ) రెండో దశకు మంత్రివర్గం అనుమతి తెలిపింది. రూ.3,145 కోట్ల అంచనా వ్యయంతో 1,142 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులను సంరక్షించడం, అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఐదేళ్లపాటు అమలు కానున్న ఈ కార్యక్రమంలో నగరంలోని దెబ్బతిన్న రహదారులను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించడం, అవసరమైన చోట్ల బీటీ, సీసీ రోడ్లు వేయడం, మరమ్మతులు చేపట్టడం వంటి పనులు నిర్వహించనున్నారు.

వివరాలు 

రూ.280 కోట్లతో ఉస్మాన్‌సాగర్‌ కాండ్యూట్

తాగునీటి సరఫరా బలోపేతానికి మంజీరా పైపులైన్ల మార్పిడి పనులకు కూడా ఆమోదం లభించింది. 1965లో ఏర్పాటు చేసిన ఫేజ్-1, 1981లో నిర్మించిన ఫేజ్-2 పైపులైన్ల స్థానంలో రూ.772 కోట్ల వ్యయంతో కొత్త పైపులైన్ వేయనున్నారు. 1,500 మిల్లీమీటర్ల వ్యాసంతో కలబ్‌గూర్ నుంచి హైదర్‌నగర్ వరకు నీటిని పంపింగ్ చేసే విధంగా లైన్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం రోజుకు 45 ఎంజీడీల మంజీరా నీరు సరఫరా అవుతుండగా, పాత పైపులు దెబ్బతినడంతో మైల్డ్ స్టీల్‌తో పటిష్టమైన కొత్త లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మాన్‌సాగర్ నుంచి తాగునీటి సరఫరాకు ఉపయోగిస్తున్న కాండ్యూట్ స్థానంలో కొత్త పైపులైన్ వేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.

Advertisement

వివరాలు 

రిజర్వాయర్‌కు రెండెకరాలు

రూ.280 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్‌సాగర్ నుంచి ఆసిఫ్‌నగర్ ఫిల్టర్‌బెడ్ల వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర 1920లో నిర్మించిన కాలువ ద్వారా రోజుకు 25 ఎంజీడీల నీటిని గ్రావిటీ విధానంలో తరలించే సామర్థ్యం ఉన్నప్పటికీ, లీకేజీలు, పాతబడి పోవడం వల్ల ప్రస్తుతం 19 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కోకాపేట నియోపొలిస్ ప్రాంతంలో జలమండలి నిర్మించనున్న భారీ రిజర్వాయర్ కోసం గతంలో శారదాపీఠానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని ఇవ్వడానికి మంత్రివర్గం అనుమతించింది. శారదాపీఠానికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయించనున్నారు.

Advertisement

వివరాలు 

జంతు సంరక్షణ కేంద్రం

అలాగే హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించేందుకు నవాబ్‌పేట మండలంలోని చిట్టిగూడ, యావాపూర్ గ్రామాలు, మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి, ఏక్తాలా గ్రామాలను కొత్తగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో వీధి కుక్కలు మరియు ఇతర జంతువుల సంరక్షణ కోసం గోపన్‌పల్లిలో ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ, రాంకీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా అమలు చేస్తాయి. జీహెచ్‌ఎంసీ స్థలం కేటాయించి ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించగా, రాంకీ ఫౌండేషన్ భవన నిర్మాణం,మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ చూసుకుంటుంది.

Advertisement