
Telangana: ఇవాళే తెలంగాణ కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక, దాని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే నివేదికపై తీర్మానం తీసుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌కు వివరాలు ఇవ్వనున్నారు. ఇక గోశాలల పాలసీకి తుది రూపుదిద్దే అవకాశం కూడా ఈ భేటీలో ఉంది.
Details
పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన బోధనా సిబ్బంది పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే అంశంపై చర్చ జరగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలను సిద్ధం చేయనున్నారు. యూరియా సరఫరా, డిమాండ్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి తీర్మానం చేసే అవకాశముంది. జిల్లాల్లో మంత్రులు ఇటీవల చేపట్టిన పర్యటనల్లో గుర్తించిన సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఇక మత్స్యకార సహకార సంఘాల పర్సన్ ఇంఛార్జ్‌ల నియామకంపై చర్చించనున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను కూడా కేబినెట్‌లో పరిగణనలోకి తీసుకునే అవకాశముంది.