Page Loader
మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు
మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ

మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు

వ్రాసిన వారు Stalin
Mar 15, 2023
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని కందర్ లోహాలో మార్చి 26న జరిగే భారీ బహిరంగ సభకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని పార్టీ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున నాయకులు, ప్రజలు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. బీఆర్ఎస్ విధానాలు దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకువస్తాయని ప్రకటనలో వెల్లడించింది. పార్టీ విధానాలు నచ్చి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పేర్కొంది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించే ప్రణాళికలో భాగంగా కేసీఆర్ గత నెలలో నాందేడ్‌లో మొదటి బహిరంగ సభను నిర్వహించారు.

కేసీఆర్

ఎన్‌సీపీ నుంచి భారీగా బీఆర్ఎస్‌లోకి చేరికలు

ఇటీవల నాందేడ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించడంతో జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిందని, అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తపన, ఆయన దార్శనికత మహారాష్ట్రతో పాటు ఉత్తర భారతదేశంలోని ప్రజలను ఆకర్షిస్తోందని బీఆర్ఎస్ పేర్కొంది. ఎన్‌సీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అధ్యక్షుడు శంకరన్న దోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ ఘిసేవాడ్, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, యూత్ సెక్రటరీ శివరాజ్ ధోంగే, నాందేడ్ అధ్యక్షుడు శివదాస్ ధర్మపురికర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనోహర్ పాటిల్ భోసికర్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.