Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ పత్రాలను డిజిటలైజ్ చేశారు. వీరిలో 1,71,99,636మంది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటర్లుగా నమోదయ్యారు. మిగిలిన 92,87,577మంది ఓటర్ల అర్హతను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయనుంది. నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపించి తమ అర్హతను నిరూపించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య ఎంత ఉంటుందో స్పష్టత రానుంది. ఇప్పటికే 73,39,235 మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్(ఏఎస్‌డీడీ)జాబితాలో చేర్చి ఓట్లు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
60.50 లక్షల మంది అనామలీస్ జాబితాలో
ఈ వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ సమావేశంలో అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో చారి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
నోటీసులు అందుకోబోయే 92,87,577 మంది ఓటర్లలో 60,50,918 మంది అనామలీస్ జాబితాలో ఉన్నారని సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
ఓటర్లను మ్యాపింగ్ చేసిన వివరాల్లో వ్యత్యాసాలు కనిపించిన వారిని అనామలీస్ కేటగిరీలో చేర్చారు.
మరో 32,36,659 మంది తమ ఎన్యూమరేషన్ పత్రాల్లో ఎస్‌ఐఆర్-2002కు సంబంధించిన వివరాలను మ్యాపింగ్ చేయలేదు. వీరికి కూడా నోటీసులు జారీ చేయనున్నారు.
వివరాలు
60.50 లక్షల మంది అనామలీస్ జాబితాలో
బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) నోటీసులను ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా అందజేస్తారు.
నోటీసులు అందుకున్న వారు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్వో) ఎదుట హాజరై ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ కార్డును ఈ ప్రక్రియలో గుర్తింపు పత్రాలుగా పరిగణించబోమని సీఈవో స్పష్టం చేశారు.
ఏదైనా ప్రాంతంలో నోటీసులు అందుకునే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. అక్కడ అదనపు ఏఈఆర్వోలను నియమిస్తామని తెలిపారు.
నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ సమాధానాన్ని సమర్పించాలని స్పష్టం చేశారు.
వివరాలు
73.39 లక్షల ఓట్లు ఇప్పటికే తొలగింపు
బీఎల్‌ఏల సంతకాలను తీసుకుని అన్‌కలెక్టబుల్ (ఏఎస్‌డీడీ) జాబితాను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఇందులో మొత్తం 73,39,235 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పటికే తొలగించినట్లు సీఈవో వెల్లడించారు.
అయితే పొరపాటున ఎవరైనా ఓటరును ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చి ఉంటే.. వారు మళ్లీ ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం
తమ పేరును ఎలాంటి కారణం లేకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని భావించే వారు అభ్యంతరాలు,ఫిర్యాదులను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.
ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 మంది ఈఆర్వోలు,892 మంది ఏఈఆర్వోలు వీటిని పరిశీలించనున్నారు.
ఫిర్యాదుల కోసం పత్రం-9,10,11, 11ఏ, 11బీలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.
నోటీసుల జారీ,ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియ ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు కొనసాగుతుంది.
ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి 18సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత కూడా ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
వివరాలు
పోలింగ్ కేంద్రాలు, సీరియల్ నంబర్లు మారొచ్చు
ముసాయిదా ఓటర్ల జాబితాలో గతంలో ఉన్న పోలింగ్ నంబర్లు మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఓటర్ల హేతుబద్ధీకరణ కారణంగా కొందరి పోలింగ్ కేంద్రాలు, సీరియల్ నంబర్లలో మార్పులు చోటుచేసుకోవచ్చని సీఈవో వివరించారు.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లకు ఈ మార్పులు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 49,018 మందిని బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు)గా నియమించినట్లు తెలిపారు.
వివరాలు
రాజకీయ పార్టీలతో అధికారుల సమావేశం
మీడియా సమావేశానికి ముందు ముసాయిదా ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముఖ్య ఎన్నికల అధికారులు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీఈవో సుదర్శన్‌రెడ్డి పార్టీ ప్రతినిధులకు వివరించారు.
డిజిటలైజేషన్, అన్‌డిజిటలైజేషన్ ప్రక్రియలో చేర్చిన ఓటర్ల వివరాలను కూడా వారికి అందించారు.
అయితే ముసాయిదా జాబితా ప్రక్రియను తొందరపాటుగా పూర్తి చేయకుండా మరింత గడువు ఇవ్వాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు.
అవసరమైతే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని కూడా కొన్ని పార్టీల ప్రతినిధులు తెలిపారు.
వివరాలు
ఓటు తొలగించే ముందు నోటీసు తప్పనిసరి
ముసాయిదా ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు సీఈవో తెలిపారు.
ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్లైన sceotelangana.nic.in, voters.eci.gov.inతో పాటు ఈసీఐనెట్ మొబైల్ యాప్‌లోనూ ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవచ్చని చెప్పారు.
ముసాయిదా జాబితాతో పాటు అనామలీస్, ఏఎస్‌డీడీ జాబితా వివరాలను కూడా ఆన్‌లైన్‌లో చూడవచ్చన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులకు ముసాయిదా జాబితాను అందజేశామని తెలిపారు.
ఈఆర్వో, ఏఈఆర్వో కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జాబితాను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
వివరాలు
ఓటు తొలగించే ముందు నోటీసు తప్పనిసరి
ముసాయిదా జాబితాలో ఉన్న ఏ ఒక్కరి పేరును ఈఆర్వో లేదా ఏఈఆర్వో నోటీసులు జారీ చేయకుండా తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.
సంబంధిత ఓటరును విచారించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఒకవేళ ఓటును తొలగించాల్సిన పరిస్థితి వస్తే.. అందుకు స్పష్టమైన కారణాలను పేర్కొంటూ స్పీకింగ్ ఆర్డర్ జారీ చేస్తామని వివరించారు.
సరైన కారణం లేకుండా ఓటును తొలగించారని ఎవరైనా భావిస్తే.. ఆ నిర్ణయంపై 15 రోజుల్లోపు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో)కి అప్పీల్ చేసుకోవచ్చు.
డీఈవో నిర్ణయంతోనూ సంతృప్తి చెందకపోతే.. 30 రోజుల్లోపు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో)కి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
నోటీసులు అందుకునే వారి పేర్లు కూడా ముసాయిదా జాబితాలోనే..
డిజిటలైజేషన్ పూర్తయిన మొత్తం 2,64,87,213 మంది ఓటర్ల వివరాలను ముసాయిదా జాబితాలో చేర్చారు.
ఈ జాబితాలోనే నోటీసులు అందుకోబోయే 60,50,918 మంది అనామలీస్ ఓటర్లు, ఎస్‌ఐఆర్-2002 వివరాలను మ్యాపింగ్ చేయని 32,36,659 మంది ఓటర్లు కూడా ఉన్నారు.
అయితే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ముసాయిదా జాబితాలో ఎవరికి నోటీసులు జారీ కానున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చూపించలేదు.
దీంతో ముసాయిదా జాబితాలో తమ పేరు కనిపిస్తే తమకు నోటీసులు రావని పలువురు ఓటర్లు భావించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వాస్తవానికి నోటీసులు అందుకోబోయే ఓటర్ల పేర్లు కూడా ముసాయిదా జాబితాలోనే ఉంటాయి.
బీఎల్‌వోలు ఇంటికి వచ్చి నోటీసు అందజేసిన తర్వాతే సంబంధిత ఓటరుకు నోటీసు జారీ అయిందన్న విషయం స్పష్టమవుతుంది.
వివరాలు
నోటీసులు అందుకునే వారి పేర్లు కూడా ముసాయిదా జాబితాలోనే..
ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి కొంతమంది అనామలీస్ కేటగిరీలో ఉన్న ఓటర్లకు ఫోన్ ద్వారా నోటీసులు వచ్చినట్లు సందేశాలు అందినట్లు సమాచారం.
అఖిలపక్ష సమావేశంలోనూ పలువురు రాజకీయ నేతలు నోటీసులు అందుకోబోయే ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా ప్రదర్శించాలని కోరారు.
బీఎల్‌వో కార్యాలయాల్లోనూ నోటీసులు అందుకునే ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచితే సంబంధిత ఓటర్లకు మరింత సౌకర్యంగా ఉంటుందని పార్టీ ప్రతినిధులు సూచించారు.
ముసాయిదా జాబితాలో పేరు ఉందని మాత్రమే తుది ఓటరు జాబితాలో పేరు కొనసాగుతుందని భావించకుండా.. నోటీసులు అందిన వారు నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారుల ఎదుట హాజరై తమ అర్హతను నిరూపించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.