LOADING...
Davos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!
దావోస్‌లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!

Davos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం రెండో రోజునే గణనీయమైన ఫలితాలు సాధించింది. బుధవారం ఒక్కరోజులోనే రాష్ట్రానికి సుమారు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు రాబట్టేలా పలు అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమలు,ఇంధనం,టెక్నాలజీ, విమానయాన రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నెల 23 వరకు కొనసాగే సదస్సులో మరిన్ని కంపెనీలతో చర్చలు జరిపేందుకు తెలంగాణ బృందం సిద్ధమవుతోంది.

వివరాలు 

తెలంగాణలో రూ.12,500కోట్ల పెట్టుబడితో స్టీల్ ఉత్పత్తి

డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్...తెలంగాణలో రూ.12,500కోట్ల పెట్టుబడితో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపింది. అలాగే స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ...రూ.6వేల కోట్లతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR)ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సౌందర్య రంగంలో అగ్రగామిగా ఉన్న లోరియల్... హైదరాబాద్‌లో రూ.3,500కోట్ల పెట్టుబడితో తొలి గ్లోబల్ టెక్ హబ్ను ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. విమానయాన రంగానికి చెందిన అమెరికా సంస్థ సర్గాడ్... తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతుల యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రానున్న 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది.

వివరాలు 

స్టీల్ ప్లాంట్‌తో 12 వేల ఉద్యోగాల అవకాశాలు

దావోస్‌లో బుధవారం తెలంగాణ రైజింగ్ బృందం రష్మి గ్రూప్‌తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రష్మి గ్రూప్ ప్రమోటర్ సజ్జన్ కుమార్ పట్వారి, డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలంగాణ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ... తెలంగాణ విభిన్న రంగాల్లో పరిశ్రమల అభివృద్ధితో బలమైన పారిశ్రామిక రాష్ట్రంగా ఎదుగుతోందని తెలిపారు. ముఖ్యంగా తయారీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారం, బొగ్గు సరఫరా లింకేజీలను అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

వివరాలు 

స్టీల్ ప్లాంట్‌తో 12 వేల ఉద్యోగాల అవకాశాలు

రూ.12,500 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ లేబర్-ఇంటెన్సివ్ విధానంలో పనిచేస్తూ భారీ స్థాయిలో ఉపాధి కల్పిస్తుందని డైరెక్టర్ సంజిబ్ కుమార్ వెల్లడించారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా చర్చలు జరిగాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర-దక్షిణ అమెరికా దేశాలతో సహా 40కి పైగా దేశాల్లో రష్మి గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Advertisement

వివరాలు 

క్లీన్ & గ్రీన్ ఎనర్జీలో మరో కీలక అడుగు

తెలంగాణ రాష్ట్రం క్లీన్, గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు వేసింది. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు సమావేశమై...రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డా.జాన్ బాబిక్,సీఈవో అనిల్‌కుమార్ బావిసెట్టి,గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈవో మొలుగు శ్రీపాల్‌రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ తదితరులు పాల్గొన్నారు. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని సాధించడమే తెలంగాణ ప్రధాన ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వివరాలు 

క్లీన్ & గ్రీన్ ఎనర్జీలో మరో కీలక అడుగు

స్లోవేకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో భాగస్వామ్యంతో ఏర్పడిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ... తెలంగాణలో గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటును పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ.6,000 కోట్లుగా అంచనా.

వివరాలు 

హైదరాబాద్‌లో తొలి బ్యూటీ-టెక్ జీసీసీ

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో లోరియల్ సీఈవో నికోలస్ హియెరోనిమస్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ హబ్ ద్వారా 'భారత్ నుంచి ప్రపంచానికి' సౌందర్య పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు, స్థానిక ప్రతిభను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. 2030 నాటికి రూ.3,500 కోట్లకుపైగా పెట్టుబడితో ఈ కేంద్రం గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారనుంది. ఏఐ నిపుణులు, టెక్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులకు 2,000కుపైగా ఉద్యోగాలు కల్పించనుంది.

వివరాలు 

హైదరాబాద్‌లో తొలి బ్యూటీ-టెక్ జీసీసీ

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా లోరియల్ ఎంచుకోవడం తెలంగాణలోని ఇన్నోవేషన్ వాతావరణానికి నిదర్శనమన్నారు. ఇది తెలంగాణ రైజింగ్-2047 విజన్‌కు బలాన్నిస్తుందని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు... మెడ్‌టెక్, హెల్త్‌టెక్‌తో పాటు బ్యూటీ-టెక్ వంటి కొత్త రంగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని పేర్కొన్నారు. లోరియల్ సీఈవో నికోలస్ హియెరోనిమస్... ఈ ఒప్పందం ఇండో-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్-2026లో కీలక మైలురాయిగా నిలుస్తుందని, భవిష్యత్తులో తయారీ రంగంలోనూ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

వివరాలు 

ఏబీ ఇన్‌బెవ్ యూనిట్ విస్తరణకు సిద్ధం

ప్రపంచంలోనే అతిపెద్ద బీరు తయారీ సంస్థ ఏబీ ఇన్‌బెవ్... తెలంగాణలో ఇప్పటికే ఉన్న తన తయారీ యూనిట్లను విస్తరించేందుకు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థ 50కుపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దావోస్‌లో తెలంగాణ రైజింగ్ బృందంతో కంపెనీ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ ఎఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్ సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు యూనిట్ల ద్వారా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సంస్థ మరింత విస్తరణకు అడుగులు వేస్తోంది. కొత్త పెట్టుబడులపై సీఎం రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు 

విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రానికి ఆసక్తి

అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీనివాస్ తోట... దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ముందుంచారు. ఏరోస్పేస్, రక్షణ, ఆటోమొబైల్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో సంస్థకు విశేష అనుభవం ఉంది. ఈ సందర్భంగా సీఎం... రాష్ట్రాన్ని సేవలు, తయారీ, వ్యవసాయ-గ్రీన్ ఎకానమీగా మూడు ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్న నేపథ్యంలో... ఈ ప్రాంతాల్లో మరమ్మతుల కేంద్రం ఏర్పాటుపై పరిశీలించాలని సూచించారు. ఈ పెట్టుబడులతో ఎంఎస్‌ఎంఈలకు కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

వివరాలు 

ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఏఐ రంగాలకు ఊతం

కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో బ్లైజ్ ప్రత్యేకత కలిగి ఉంది. సంస్థ సహవ్యవస్థాపకుడు, సీఈవో దినకర్ మునగాల... సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే హైదరాబాద్‌లో బ్లైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రం విస్తరణ, కొత్త పెట్టుబడులపై చర్చలు జరిగాయి. హెల్త్‌కేర్ డయాగ్నొస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ రంగాల్లో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టుల అమలుపైనా అవగాహన ఏర్పడింది.

వివరాలు 

రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం 

తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా వచ్చే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించవచ్చని సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేస్తూ... బ్లైజ్ ఆర్&డి విస్తరణకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement