Telangana Genco: ప్రైవేటు కరెంటుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ జెన్‌కో.. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థ నుంచి వచ్చే ఐదేళ్లపాటు 500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో గ్రీన్‌కో సంస్థ నిర్మించిన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రం నుంచి ఈ విద్యుత్‌ను తీసుకునేందుకు జెన్‌కో అంగీకరించింది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాల నుంచి మొత్తం 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఇటీవల టెండర్లు ఆహ్వానించగా, గ్రీన్‌కో సంస్థ మాత్రమే 500 మెగావాట్ల సరఫరాకు ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ ప్రతిపాదనకు జెన్‌కో ఆమోదం తెలిపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు పూర్తయిన ఆరు నెలల్లోపు తెలంగాణకు విద్యుత్ సరఫరా ప్రారంభించాలనే నిబంధనను టెండర్‌లో చేర్చింది.
వివరాలు
పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలతో ఒప్పందాలు
రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని భావిస్తూ ఆ సమయాల్లో రోజుకు ఆరు గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేయాలని మరో నిబంధన విధించింది. ప్రస్తుతం ఈ గరిష్ఠ డిమాండు సమయంలో అవసరమైన విద్యుత్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు భారత ఇంధన మార్పిడి కేంద్రం నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ఆ భారం తగ్గించేందుకు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాలతో ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఏడాదికి సుమారు రూ.615 కోట్ల భారం
ఒక్క మెగావాట్ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్‌కు ఏడాదికి రూ.1.23 కోట్ల చొప్పున చెల్లించేందుకు జెన్‌కో అంగీకరించినట్లు సమాచారం. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.615 కోట్ల భారం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక యూనిట్ విద్యుత్ ధర సగటున రూ.6.70 వరకు ఉండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. సాధారణ మార్కెట్‌లో లభించే విద్యుత్‌తో పోలిస్తే ఇది ఎక్కువ ధరేనని విమర్శలు వినిపిస్తున్నాయి. జెన్‌కో నిర్ణయించిన ధరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎంతవరకు ఆమోదం తెలుపుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
వివరాలు
తెలంగాణలో ప్లాంట్లు ఎన్నడో...
పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు తెలంగాణలోనే ఇటువంటి కేంద్రాల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలను ముందుగా ఎందుకు ఆహ్వానించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జెన్‌కో ఆధీనంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ కేంద్రాలతో పాటు ఖమ్మం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా పంప్డ్ స్టోరేజ్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని గతంలో జాతీయ జల విద్యుదుత్పత్తి సంస్థ సూచించింది.
వివరాలు
ప్రభుత్వం సూచనల మేరకు జెన్‌కో ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ
అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టకుండా ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పంపిణీ సంస్థలే విద్యుత్‌ను కొనుగోలు చేసి ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ ఈసారి ప్రభుత్వం సూచనల మేరకు జెన్‌కో ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన విద్యుత్‌ను తిరిగి పంపిణీ సంస్థలకు అందించే క్రమంలో యూనిట్‌కు 7 పైసల వరకు జెన్‌కోకు అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని సమాచారం. చివరికి ఈ భారం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపైనే పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.