Telangana Maoist Surrenders: మావోయిస్టుల పునరావాసానికి తెలంగాణ సర్కారు నిధులు.. 214 మందికి నగదు ప్రోత్సాహకాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోంది. పునరావాస విధానంలో భాగంగా తాజాగా 214 మంది మాజీ మావోయిస్టులకు రూ.5.59 కోట్ల నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం పిలుపుతో పెరిగిన లొంగుబాట్లు ఆయుధాలు విడిచిపెట్టి వచ్చిన వారికి పునరావాసం కల్పించి, తిరిగి సమాజంలో భాగం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2025 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని ఇచ్చిన పిలుపుతో లొంగుబాట్లు ఊపందుకున్నాయని వివరించారు.
వివరాలు
ఇప్పటివరకు 824 మంది లొంగుబాటు
2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
వీరిలో తెలంగాణకు చెందిన వారు 59 మంది ఉండగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి 754 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సభ్యులతో పాటు డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు, పార్టీ సభ్యులు, మిలీషియా సిబ్బంది కూడా ఉన్నారు.
వివరాలు
ఇప్పటివరకు రూ.17.68 కోట్ల పంపిణీ
తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 659 మంది లబ్ధిదారులకు రూ.17.68 కోట్ల నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన 96 మంది అర్హులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించిన వెంటనే వారికి కూడా మంజూరైన ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.