Future City: ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు.. 21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగర అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఫ్యూచర్ సిటీని స్థాపించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాల తరువాత నాలుగవ నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ ప్రాంతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించాలని కూడా నిర్ణయించింది. ఈ నగరంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ స్థాయి సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టే అవకాశముంది.
21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్
దాంతో, ట్రాఫిక్, భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్-13 నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నారు. భవిష్యత్తులో ఈ రహదారి మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్ రింగ్ రోడ్ (RRR) వరకు అనుసంధానించబడుతుంది. ఈ రహదారి మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా వెళుతుంది. హెచ్‌ఎండీఏ ఇప్పటికే రోడ్ ఎలైన్‌మెంట్‌ను రూపొందించి, రేవంత్ సర్కారు ఆమోదం పొందిన వెంటనే నిర్మాణం ప్రారంభమవుతుందని సమాచారం.
భూముల ధరలకు రెక్కలు
గ్రీన్ ఫీల్డ్ రహదారి మార్గంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని పలు గ్రామాలు వస్తాయి. ఈ రహదారి నిర్మాణంపై స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంస్థలు వస్తుండటంతో భూముల ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ధర ఉండగా, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది.