తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు
తెలంగాణలోని అర్చకుల వేతనాలతో కూడిన 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రస్తుతం నెలకు రూ.6000ను ప్రభుత్వం అందిస్తుండగా, దాన్ని రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 'ధూప దీప నైవేద్యం' సాయం నెలకు రూ.2500 ఉండేది. జూన్ 9, 2015న సీఎం కేసీఆర్ తొలిసారి దీన్ని 6వేలకు పెంచారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,800 అర్చకులకు లబ్ధి
ప్రస్తుతం పెంచిన రూ.10వేలలో రూ.6000 అర్చకులకు గౌరవ వేతనం కాగా, రూ.4000ను 'ధూప దీప నైవేద్యం'కు కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 31న గోపన్‌పల్లిలో విప్రహిత భామనా సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ 'ధూప దీప నైవేద్యం' సాయాన్ని పెంచుతామని ప్రకటించారు. జూన్ 7న ధూప దీప నైవేద్యం సాయాన్ని రూ.6000 నుంచి రూ.10,000కు పెంచాలని ఎండోమెంట్స్ కమిషనర్ సీఎం కేసీఆర్‍కు ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదనకు తాజాగా సీఎం ఆమోదం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో దాదాపు 4,800 అర్చకులకు లబ్ధి చేకూరనుంది.