Telangana Government: గూడ్స్ వాహనాలకు జీవితకాల పన్ను విధానంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
సరకు రవాణా వాహనాలకు సంబంధించిన పన్నుల విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న త్రైమాసికంగా (మూడు నెలలకోసారి) పన్ను చెల్లించే విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో జీవితకాల పన్ను (లైఫ్‌టైమ్ ట్యాక్స్) విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా వాహన యజమానులకు కొంత ఊరట కల్పించడమే కాకుండా, పన్ను ఎగవేతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న సరకు రవాణా వాహనాల్లో దాదాపు 25 శాతం వాహనాలు క్రమం తప్పకుండా పన్ను చెల్లించడం లేదని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ నష్టం వాటిల్లుతోంది.
వివరాలు
వాహనం ధరలో 7.5 శాతం లైఫ్‌టైమ్ ట్యాక్స్
అదే సమయంలో పన్నుల వసూలు కోసం రవాణా శాఖ అధికారులు తరచూ రోడ్లపై తనిఖీలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో, కొత్తగా కొనుగోలు చేసే గూడ్స్ వాహనాల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత విధానం ప్రకారం వాహనం మొత్తం ధరపై 7.5 శాతాన్ని లైఫ్‌టైమ్ ట్యాక్స్‌గా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీలో సూచనాత్మకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, వాహన యజమానులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ నిబంధన వర్తింపు
గడువు మిస్ అయ్యినపుడు పడే జరిమానాల బెడద నుంచి విముక్తి లభించడంతో పాటు, తరచూ జరిగే అధికారుల తనిఖీల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే ఈ జీవితకాల పన్ను విధానం కొత్తగా కొనుగోలు చేసే సరకు రవాణా వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టత వస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయి రోడ్లపై నడుస్తున్న పాత వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న త్రైమాసిక పన్ను విధానమే కొనసాగనుంది.
వివరాలు
దీర్ఘకాలంలో ప్రభుత్వ ఖజానాకు మేలు
ఈ కొత్త విధానం వల్ల ప్రభుత్వానికి ప్రారంభ దశలో ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశమున్నా, ఆ తర్వాత ఆయా వాహనాల నుంచి త్రైమాసిక పన్ను రూపంలో వచ్చే ఆదాయం నిలిచిపోతుంది. అయినప్పటికీ, పన్ను ఎగవేతను పూర్తిగా అడ్డుకోవడం ద్వారా దీర్ఘకాలంలో ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.