Telangana: ప్రైవేట్ పాఠశాలలకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులపై ఏటా పెరుగుతున్న ఫీజుల భారాన్ని నియంత్రించేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచకుండా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు తమ తరగతుల వారీగా అమలు చేస్తున్న ఫీజుల వివరాలను తగిన ఆధారాలతో సహా విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. పాఠశాలలు తమ వద్ద ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుల వివరాలను విద్యాశాఖ అధికారిక పోర్టల్ 'schooledu.telangana.gov.in'లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలలు తప్పనిసరి రికార్డులను సమర్పించేలా చూడటంతో పాటు.. ఏటా ఇష్టానుసారంగా ఫీజులు పెంచే విధానానికి అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ పేర్కొంది.
వివరాలు
ఫీజుల నిర్ణయంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే
పాఠశాల విద్య సమగ్రసంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలి.
అయితే పాఠశాలలు కేవలం ఫీజు మొత్తాలను మాత్రమే పోర్టల్‌లో నమోదు చేస్తే సరిపోదు.
ఫీజుల నిర్ణయంలో పారదర్శకత కోసం మరికొన్ని వివరాలను కూడా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజు నిష్పత్తి వివరాలు, ఫీజులను ఖరారు చేసేందుకు నిర్వహించిన చర్చల వివరాలు, వాటికి సంబంధించిన నివేదికలు, ఆధారిత పత్రాలు సమర్పించాలి. అలాగే పాఠశాల గవర్నింగ్ బోర్డు సభ్యుల సంతకాలతో కూడిన రికార్డులను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
వివరాలు
నిబంధనలు పాటించకపోతే షోకాజ్ నోటీసులు
పాఠశాల నోటీసు బోర్డులపై ఫీజుల వివరాలను ప్రదర్శించని యాజమాన్యాలపై, అలాగే విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేయడంలో విఫలమయ్యే ప్రైవేట్ పాఠశాలలపై నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఈ నిర్ణయం అమలుతో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయంలో పారదర్శకత పెరగడంతో పాటు.. విచ్చలవిడిగా ఫీజులు పెంచే విధానానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి ప్రైవేట్ పాఠశాల కూడా విద్యాశాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.