తెలంగాణలో మరో 2 కొత్త మండలాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
తెలంగాణలో నూతనంగా మరో రెండు మండలాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లి గోరి మండలంగా ఏర్పడింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలాన్ని ఏర్పాటు చేసేందుకు గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతులను పరిశీలించి పైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. కొత్తగా మరో మండలం ఏర్పాటు కావడంతో మొత్తం జిల్లాలోని మండలాల సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలోని పలు మండలాల్లో మరికొన్ని భూబదలాయింపులు
కొత్తగా రంగారెడ్డి జిల్లాలో ఇర్విన్ మండల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు చేసింది. మాడ్గుల్ మండలం నుంచి 9 గ్రామాలతో ఇర్విన్ మండలాన్ని ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాలు, వినతులను 10 రోజుల్లోగా తెలపాలని స్పష్టం చేసింది. జిల్లాలో 12 పురపాలికలు, 3 నగరపాలికలు ఉన్నాయి. ఇర్విన్ మండల ఏర్పాటుతో మండలాల సంఖ్య 28కి చేరుతుంది. హనుమకొండ జిల్లాలోని రెండు గ్రామాలను బదలాయించేందుకూ ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీ చేసింది. వేలేరు మండల పరిధిలోని కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి బదిలీ చేసింది. వేలేరు మండలం ఎర్రబల్లె గ్రామాన్ని హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలానికి బదలాయింపు జరిగింది. అభ్యంతరాలు, వినతులకు 15 రోజుల గడువిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.