వచ్చే ఎన్నికలు బండి సంజయ్ నేతృత్వంలోనే.. మరోసారి తేల్చిచెప్పిన తరుణ్ చుగ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు జరగనున్నాయనే ప్రచారాన్ని బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు.
స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ విషయంలో మార్పులు లేవని ఫోన్ ద్వారా తేల్చి చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని వివరించారు.
గత కొద్ది రోజులుగా అధ్యక్షుడి మార్పుపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన చుగ్, పదేపదే దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఈ అంశం గతంలోనూ ప్రచారమైందని, అప్పుడు కూడా దీనిపై స్పష్టత ఇచ్చామని గుర్తు చేశారు. అయినప్పటికీ మళ్లీ మళ్లీ ఎందుకు విపరీత ప్రచారాలు చేస్తున్నారో తెలియట్లేదన్నారు.
DETAILS
బీఆర్ఎస్ తో మాకేం రహస్య ఒప్పందాలు లేవు: తరుణ్ చుగ్
బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నారంటూ వస్తున్న కథనాలను తరుణ్ చుగ్ తోసిపుచ్చారు.
సంజయ్ తీరుపై కేడర్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం చేయడాన్ని చుగ్ ఖండించారు. బండి నేతృత్వంలోనే తెలంగాణ బీజేపీ ఎన్నికలకు వెళ్లనుందన్నారు. అధ్యక్షుడ్ని మార్చే ఉద్దేశం లేదన్నారు.
బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చుగ్ అభిప్రాయపడ్డారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని అనడాన్ని కొట్టిపారేసిన చుగ్ ఎన్నికల సమయంలో పార్టీ ప్రెసిడెంట్ పదవిలో మార్పులు చేర్పులు చేయలనుకోవట్లేదన్నారు.
దిల్లీలోని జాతీయ నాయకత్వంతో ఈటల వరుసగా జరిపిన భేటీల నేపథ్యంలో ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చుగ్ స్పష్టతనిచ్చారు.