Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. స్కాలర్‌షిప్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి..!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయిస్తూ సవరణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇకపై నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జారీ చేశారు.
వివరాలు
సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
విద్యార్థుల ఉపకార వేతనాలు, ట్యూషన్ ఫీజుల దుర్వినియోగాన్ని నివారించేందుకు ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలని సూచించారు. అదనంగా ఇంటర్మీడియట్ బోర్డు, ఉపాధి కల్పన అధికారులు, ఉన్నత విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ఈ అధికారులు సంక్షేమ శాఖలతో సమన్వయం చేస్తూ విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారో లేదో నిరంతరం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్‌షిప్ నిధుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
వివరాలు
విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు
విద్యాశాఖ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపై సవివరంగా చర్చించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో స్కాలర్‌షిప్‌లపై సానుకూల నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.