Telangana Government: నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి
ఈ వార్తాకథనం ఏంటి
మీడియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులకే తమ వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్ వినియోగానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ(I&PR)కమిషనర్ అధికారికంగా విడుదల చేశారు. ఇటీవలి కాలంలో క్షేత్రస్థాయిలో కొందరు కేవలం యూట్యూబ్ ఛానెల్స్ లేదా ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన ఐడీ కార్డులు చూపిస్తూ తమ వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లను నిర్బంధం లేకుండా ఉపయోగిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ కారణంగా నిజమైన జర్నలిస్టుల విశ్వసనీయత,వృత్తి గౌరవం దెబ్బతింటోందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
వివరాలు
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్
సెంట్రల్ మోటార్ వెహికల్స్ చట్టం-1989 ప్రకారం వాహనాలపై లేదా నంబర్ ప్లేట్లపై అనుమతి లేకుండా 'ప్రెస్', 'పోలీస్', 'గవర్నమెంట్' వంటి పదాలు వాడటం చట్టవిరుద్ధమని అధికారులు గుర్తు చేశారు. కొత్త నిబంధనలను ఉల్లంఘించి అక్రిడిటేషన్ లేకుండానే 'ప్రెస్' స్టిక్కర్లు ఉపయోగిస్తే అది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అటువంటి సందర్భాల్లో భారీ జరిమానాలు విధించడమే కాకుండా అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అధికారాన్ని కూడా రవాణా శాఖకు ఇచ్చినట్లు తెలిపారు. అక్రిడిటేషన్ లేని వ్యక్తులు తమ వాహనాలపై ఉన్న 'ప్రెస్' స్టిక్కర్లను వెంటనే తొలగించుకోవాలని హెచ్చరించారు.
వివరాలు
అనధికారిక స్టిక్కర్లపై త్వరలో పోలీస్, రవాణా శాఖల స్పెషల్ డ్రైవ్
లేనిపక్షంలో పోలీస్, రవాణా శాఖలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే టోల్ ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నకిలీ జర్నలిస్టుల కారణంగా ఏర్పడుతున్న గందరగోళం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు అక్రిడిటేషన్ లేని నిజమైన ఫీల్డ్ రిపోర్టర్లకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, జర్నలిజం వృత్తి గౌరవం, నమ్మకాన్ని కాపాడేందుకు ఈ చర్య తప్పనిసరిగా అవసరమని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.