
Telangana: చిన్నారులకు ఉదయం పాలు.. ఉప్మా.. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్య పొందుతున్న చిన్నారులకు తప్పనిసరిగా పాలు అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం సమయాల్లో అల్పాహారాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీల్లో 3-6 ఏళ్ల వయసు పిల్లలకు మధ్యాహ్నం ఒక్కసారి అన్నం, ప్రతిరోజూ ఒక గుడ్డు అందిస్తున్నారు. ఇకపై వీరికి అదనంగా రోజుకు 100 మి.లీ. పాలు, ఉదయం అల్పాహారం కూడా ఇవ్వాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం, రాష్ట్రంలోని చిన్నారుల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం వంటి లోపాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
వంద రోజుల న్యూట్రిషన్ మిషన్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమం
ఈ పరిస్థితిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలతో కూడిన పోషకాహార ప్రణాళికను రూపొందిస్తోంది. ఇప్పటికే కౌమారదశ బాలికలకు చిరుధాన్యాలు, పల్లీ చిక్కీలు అందిస్తున్న ప్రభుత్వం, అదనంగా మరిన్ని పోషకాహార పదార్థాలు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వంద రోజుల న్యూట్రిషన్ మిషన్ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది. వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, పంచాయతీరాజ్ శాఖ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖలు, పౌర సరఫరాలు, ప్రజాసంబంధాల శాఖల సమన్వయంతో శిశుసంక్షేమశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
వివరాలు
ప్రణాళిక ముఖ్యాంశాలు ఇవే..
ఎన్‌ఐఎన్ మార్గదర్శకాల ప్రకారం: పూర్వ ప్రాథమిక విద్య పొందుతున్న చిన్నారులకు అదనపు క్యాల్షియం, ప్రోటీన్ల కోసం ప్రతి రోజూ 100 మి.లీ. పాలు అందజేయడం. పోషకాహార మెరుగుదల: చిన్నారులు, మహిళలు, కౌమారదశ బాలికలకు అదనంగా తృణధాన్యాలతో కూడిన ఆహార పదార్థాలు అందించడం. అల్పాహారం: అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి తోడు, ఉదయం వేళల్లో ఉప్మా, ఉగ్గానీ వంటి అల్పాహారం అందించడం. ప్రత్యేక ప్రచారం: రాష్ట్రవ్యాప్తంగా వంద రోజుల న్యూట్రిషన్ మిషన్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం. స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని పెంచడం. తల్లులకు అవగాహన: పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించేందుకు తల్లులను ప్రోత్సహించే బృందాలను ఏర్పాటు చేయడం. అలాగే యువతులు, చిన్నారుల్లో ఆహార అలవాట్లు, ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టడం.
వివరాలు
ఈ ఏడాదికి తగ్గింపు లక్ష్యాలివీ..
ఎత్తుకు తగిన బరువు లేని పిల్లల శాతం: 21.7 శాతం నుండి 16.7 శాతానికి తగ్గించడం. రక్తహీనత: 70 శాతం నుండి 65 శాతానికి తగ్గించడం. వయసుకు తగిన ఎత్తు లేని పిల్లల శాతం: 33.1 శాతం నుండి 30.1 శాతానికి తగ్గించడం. వయసుకు తగిన బరువు లేని పిల్లల శాతం: 31.8 శాతం నుండి 25.8 శాతానికి తగ్గించడం.