Kaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక
ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది. ప్రతీ ఏడాది ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహితీ పురస్కారాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం అవార్డు గ్రహీత ఎంపిక కోసం ప్రభుత్వం ప్రముఖ కవి అందెశ్రీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా 2024 కాళోజీ పురస్కారానికి నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆయనకు పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా నలిమెల భాస్కర్‌ను సన్మానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,01,116 రూపాయల నగదు పురస్కారం ఇవ్వనున్నారు.
భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువాదం
నలిమెల భాస్కర్ బహుభాషా కోవిదుడు, ఆయనకు 14 భాషల్లో అధికమైన నైపుణ్యం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన ఆయన, తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. భాస్కర్ రచనల్లో అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక్క వంటి సంకలనాలు ప్రసిద్ధమైనవి. ఆయన పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు, అలాగే తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక శిశిగల్ను తెలుగులో స్మారక శిలలు పేరిట అనువదించి, ఈ పుస్తకానికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య అవార్డు పొందారు.