Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో చేసిన దాడిని మరవక ముందే.. శనివారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై పలువురు దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో బాలరాజుతో పాటు అతని అనుచరులు కూడా గాయపడ్డారు వారిని వెంటనే హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఓటర్లకు ఎమ్మెల్యే డబ్బులు పంచుతున్నట్లు కాంగ్రెస్ నేతలు అనుమానించిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు అచ్చంపేట సీఐ అనుదీప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో గందరగోళం ఏర్పడి కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించినట్లు అనుదీప్ తెలిపారు.
దాడులకు భయపడేది లేదు: గువ్వల బాలరాజు
గాయాలతో అపోలో ఆస్పత్రిలో చేరిన గువ్వల బాలరాజు ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదన్నారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. గతంలో కూడా తనపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ దాడులు చేయించినట్లు బాలరాజు పేర్కొన్నారు. శనివారం రాత్రి స్వయంగా ఆయనే తనపై దాడులు చేయించినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని బాలరాజు వెల్లడించారు. అంతకుముందు అపోలో ఆస్పత్రిలో బాలరాజును మంత్రి కేటీఆర్ బాలరాజును పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.