
తెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజలకు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని అందించడానికి, ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టీ- డయాగ్నాస్టిక్స్ పేరుతో పరీక్షకేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా శనివారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా, టీ-డయాగ్నాస్టిక్స్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
హైదరాబాద్‌లోని కొండపూర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వర్చువల్‌గా ఈ సేవలను తెలంగాణ వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
ఆరోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మెరుగ్గా ఉన్నాయని, టీ-డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం దేశంలో ఇదే మొదటిసారి అని హరిష్ రావు అన్నారు.
Details
31జిల్లాల్లో టీ-డయాగ్నాస్టిక్ సెంటర్లు
గతంలో కేవలం 57రకాల టెస్టులు మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు 134 టెస్టులు అందుబాటులోకి వచ్చాయని హరీష్ రావు తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్రంలోని 31జిల్లాల్లో టీ-డయాగ్నాస్టిక్ సెంటర్లు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన రెండు రాష్టాల్లోనూ డయాగ్నాస్టిక్ సెంటర్ల అభివృద్ధి జరుగుతుందని హరీష్ రావు అన్నారు. అందుకోసం కావాల్సిన పనులు జరుగుతున్నాయని వెల్లడి చేసారు.
కరోనా సమయంలో వైద్యులు చూపిన తెగువ, సేవ ఎంతో గొప్పవని, కరోనా మహమ్మారి నుండి వైద్యులే రక్షించారని డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులు అందరికీ హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేసారు.