TG High Court: తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. 2015-16.. గ్రూప్-2 రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
2015-16 గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షలకు సంబంధించిన ఎంపిక జాబితాను పూర్తిగా కొట్టివేసింది. సాంకేతిక కమిటీ సూచనలను విస్మరించి డబుల్ బబ్లింగ్, వైట్‌నర్ వాడకం, తుడిచివేతలు ఉన్న పార్ట్-బి ఓఎంఆర్ పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయడం పూర్తిగా చెల్లదని డివిజన్ బెంచ్ స్పష్టంగా పేర్కొంది. . ఈ విషయంలో సాంకేతిక కమిటీ సూచనలకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారం టీఎస్‌పీఎస్సీకి లేదని కోర్టు తేల్చిచెప్పింది.
వివరాలు
ఈ ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఆదేశాలు జారీ
జవాబు పత్రాల్లో స్పష్టంగా మార్పులు, ట్యాంపరింగ్ కనిపిస్తుంటే వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం కమిషన్ వైఫల్యమేనని వ్యాఖ్యానించింది. 2019 అక్టోబర్ 24న ప్రకటించిన ఫలితాలు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వాటిని రద్దు చేసింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, గత కోర్టు తీర్పుల ప్రకారం మళ్లీ మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా తయారు చేయాలని, ఆ ప్రక్రియను 8 వారాల్లో పూర్తిచేయాలని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక ఆరు పిటిషన్లపై ఈ తీర్పును వెలువరించారు.
వివరాలు
పిటిషనర్ల వాదనలు
గ్రూప్-2 కింద 13 విభాగాల్లో 1,032 పోస్టుల నియామకానికి 2015లో ప్రకటన విడుదల కాగా,2016లో మరో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చారు. నవంబర్ 11,13 తేదీలలో పరీక్షలు కూడా జరిగాయి. ప్రశ్నా పత్రాల బుక్‌లెట్ నంబర్లు,ఓఎంఆర్ షీట్ల నంబర్లు సరిపోకపోవడంతో పెద్ద గందరగోళం నెలకొంది. ఈ సమస్యను పరిశీలించేందుకు 2016 డిసెంబరులో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి,2017 మార్చిలో నివేదిక సమర్పించింది. ప్రశ్నా పత్రం బుక్‌లెట్ నంబర్-ఓఎంఆర్ నంబర్ ఒకటే కావాలని అభ్యర్థులు, పర్యవేక్షకులు అనుకోవడం వల్లే సంఘటనలు ఇలా జరిగాయని కమిటీ వివరించింది. పార్ట్-ఎలో అభ్యర్థుల వివరాల్లో చిన్న తప్పులు ఉంటే మన్నించవచ్చని,కానీ పార్ట్-బిలోని 150 ప్రశ్నల జవాబుల్లో ఏదైనా తుడిచివేత,రద్దు,వైట్‌నర్ ఉంటే ఆ పత్రాలను మూల్యాంకనం చేయకూడదని స్పష్టంగా సిఫార్సు చేసింది.
వివరాలు
అధికారిక కాపీ అందిన తరువాత బోర్డు సమావేశం
ఈ నివేదిక నేపథ్యంలో కొందరు కోర్టును ఆశ్రయించగా సింగిల్ జడ్జి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ వద్ద ఛాలెంజ్ చేయగా, ఇద్దరు న్యాయమూర్తులు సాంకేతిక కమిటీ సూచనలు సరైనవేనని, వాటిని అనుసరించి మూల్యాంకనం జరగాలని 2019 జూన్ 6న తీర్పు ఇచ్చారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా, వైట్‌నర్ వాడిన, తుడిచివేతలు చేసిన ఓఎంఆర్ పత్రాలను కూడా మూల్యాంకనం చేయడం ద్వారా టీఎస్‌పీఎస్సీ కోర్టు ఆత్మస్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని పలువురు మళ్లీ పిటిషన్లు వేశారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పును టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం పరిశీలిస్తోంది. అధికారిక కాపీ అందిన తరువాత బోర్డు సమావేశం నిర్వహించనుంది.
వివరాలు
కమిషన్ వైఫల్యమే
జవాబు పత్రాల్లో మార్పులు స్పష్టంగా ఉన్నపుడు వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం కమిషన్ పెద్ద పొరపాటు అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సాంకేతిక కమిటీ,హైకోర్టు అనుమతించిందేమిటంటే.. పార్ట్-ఎలో చిన్న వివరాల పొరపాట్లు మాత్రమే సవరించవచ్చు. అయితే పార్ట్-బిలో ప్రశ్నలకు సంబంధించిన భాగం తాకరాదు. అందుకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించడం పరీక్ష సమగ్రతను దెబ్బతీసే చర్యగా కోర్టు పేర్కొంది. పేపర్లన్నింటిని విస్తృతంగా రీవాల్యుయేషన్ చేయడం చట్టపరంగా తప్పు, ఏకపక్ష నిర్ణయం. ఇది టీఎస్‌పీఎస్సీ అధికార పరిధిని దాటి వ్యవహరించడమేనని కోర్టు తేల్చింది. కాబట్టి 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తూ, 8 వారాలలో తిరిగి మూల్యాంకనం నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించింది.
వివరాలు
పారదర్శకంగా మూల్యాంకనం: కమిషన్
మరింత పారదర్శకత కోసం భవిష్యత్తులో ఓఎంఆర్ షీట్లలో సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, భౌతిక పర్యవేక్షణతోపాటు వీడియోగ్రఫీ కూడా తప్పనిసరి చేయాలన్నారు. డివిజన్ బెంచ్ మాన్యువల్ రీవాల్యుయేషన్ ఆదేశాలు ఇప్పటికే రద్దు చేశారని కమిషన్ స్పష్టం చేసింది. యాంత్రిక విధానంలో మూల్యాంకనం జరగడం వల్ల పక్షపాతం, దురుద్దేశాలకు అవకాశం లేదని పేర్కొంది. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయని, వారు విధుల్లో పనిచేస్తున్నారని తెలిపింది. పక్షపాతం లేదా అక్రమం ఉన్నప్పుడు మాత్రమే కోర్టుకు జోక్యం అవసరమని, లేకపోతే నియామక ప్రక్రియలో న్యాయవ్యవస్థ జోక్యానికి సుప్రీంకోర్టు పరిమితులు విధించిందని వివరించింది.